అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ 27న రాక

అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ ఈ నెల 27 న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారతదేశం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ కానున్నారు. వీరి భేటీలో భారతదేశంలో మానవ హక్కులు, పెగసాస్ గూఢచర్యం విషయాలను బ్లింకెన్‌ లేవనెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 

అలాగే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలను ఉపసంహరించుకోవడం వల్ల కలిగే పరిణామాలపై, ఉగ్రవాద నిధుల విషయంలో పాకిస్తాపై ఒత్తిడి కొనసాగించాల్సిన అవసరం కూడా చర్చనీయాంశంగా ఉంటుందని అనుకుంటున్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ డీన్ థాంప్సన్ శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూపెగసాస్ గూఢచర్యం కేసులో ప్రభుత్వ పాత్ర గురించి ప్రత్యేకించి అమెరికా ఆందోళన చెందుతున్నదని పేర్కొన్నారు.

 ఇది చట్టం పరిధిలోకి రాని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పౌరులు, అధికారాన్ని విమర్శించేవారు, జర్నలిస్టులపై గూఢచర్యం చేయడాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంటున్నదని తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన అనంతరం ఆంథోనీ బ్లింకెన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. అదే సమయంలో, జూలైలో అధికారంలోకి వచ్చిన తర్వాత జో బైడెన్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి చేసిన రెండవ పర్యటన ఇది. 

ఆంథోనీ బ్లింకెన్ పర్యటన వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్య సంరక్షణ, విద్య, డిజిటల్ డొమైన్, ఆవిష్కరణ, భద్రత వంటి అనేక రంగాలలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నది. అదేవిధంగా, కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి క్వాడ్ ఇనిషియేటివ్ గురించి ఇద్దరు మంత్రులు చర్చించనున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి క్వాడ్‌లో చేర్చబడిన పలు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడం గురించి కూడా చర్చించవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ సరఫరా చేయడానికి ఇరు దేశాలు ఈ చొరవను ముందుకు తీసుకెళ్తాయి.