జాతీయ విద్యా విధానం అమలుకు ప్రధానంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాల్సిన మార్గాలను అన్వేషించాలని విద్యాభారతి స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని శారదాధామంలో జరిగిన ప్రపంచంలోనే అతి ఎక్కువ విద్యా సంస్థలను సేవ రంగంలో నిర్వహిస్తున్న విద్యా భారతి ప్రముఖుల సమావేశంలో జాతీయ విద్యావిధానం అమలుకు చొరవ చూపించవలసిన అంశాలపై దృష్టి సారించారు.
విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ అధ్యక్షత వహించారు. దక్షిణమధ్య క్షేత్రం (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ )కు చెందిన ముఖ్యమైన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. . కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకొంటూ భేటీని నిర్వహించారు.
విద్యారంగంలో భాగస్వాములుగా నిలిచే అధికారులు, నిపుణులు, పరిశోధకులకు జాతీయ విద్యా విధానం మీద అవగాహన కల్పించాలని, ఇందుకు వివిధ మాధ్యమాలను ఎంచుకోవాలని సమావేశం అభిప్రాయ పడింది. పాఠశాలల్లో వసతులు, నాణ్యతను పెంచేందుకు అవలంబించాల్సిన పద్దతులను చర్చించారు.
క్రమం తప్పకుండా ఉపాధ్యాయులకు శిక్షణ అందించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో వస్తున్న అధునాతన మార్పులకు సంబందించి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంఘీభావం తెలిపారు. పాఠశాలు తెరిచినప్పుడు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సమావేశం స్పష్టం చేసింది.
విద్యా భారతి సహ సంఘటన మంత్రి మహంతి, శైక్షణిక ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య పాల్గొన్నారు.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్