రాహుల్ నీ ఫోన్ ట్యాప్ చేస్తే అప్పగించు… బిజెపి సవాల్ 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు తన ఫోన్ ట్యాప్ అయినదని భావిస్తే దర్యాప్తు కోసం ఆ ఫోన్ ను అప్పచెప్పమని బీజేపీ సవాల్ చేసింది.  భారత ప్రభుత్వ సంస్థలు ప్రజాస్వామ్యంకు విఘాతం కలిగే రీతిలో “పెగసాస్” ఆయుధాన్ని ఉపయోగించడంకు ఏకైక పదం “రాజద్రోహం” అంటూ రాహుల్ చేసిన ఆరోపణలు “బాధ్యతారాహిత్యం”గా ఉన్నట్లు బిజెపి అధికార ప్రతినిధి రాజవర్ధన్ రాథోడ్ మండిపడ్డారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఎవ్వరి ఫోన్ ట్యాప్ చేయదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాప్ ఆరోపణలపై హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ఈ ఆరోపణలపై సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని రాహుల్ చేసిన డిమాండ్ ను కొట్టిపారవేసారు.

2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు రెండుసార్లు తిరస్కరించిన తరువాత ఏదో ఒక సాకుతో అడ్డుపడి పార్లమెంటు సమావేశాలు జరుగకుండా చేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నదని రాథోడ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడి వద్ద లభించడానికి `ఒరిజినల్ సమాచారం’ ఏమీ లేనందున చివరకు ఓ ‘జూనియర్ కాపీ రైటర్’ కూడా రాహుల్ గాంధీ ఫోన్ కంటెంట్‌ను కాపీ చేడయానికి ఆసక్తి చూపరని రాజ్యవర్ధన్ ఎద్దేవా చేశారు. 

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎటువంటి ఆరోపణలైనా చేయవచ్చని అంటూ, తాను చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపడం కోసం వెంటనే రాహుల్ తన ఫోన్ ను దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పాలని చెబుతూ భారత శిక్షాస్మృతి (ఐపిసి) ప్రకారం దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. భారత దేశంలో చట్టబద్ధ పాలన అమలులో ఉన్నదని చెబుతూ కొన్ని ఏజెన్సీలు చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఎవరికైనా అనుమానం ఉంటే, వారు ఫిర్యాదు చేయవచ్చని, చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారని రాథోడ్ స్పష్టం చేశారు. 

కాగా, పెగాస‌స్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందిస్తూ  త‌న‌కు చెందిన అన్ని ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌ని ఆరోపించారు. తాను జ‌రుపుతున్న అన్ని సంభాష‌ణ‌ల‌ను మానిట‌ర్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి త‌న‌కు ఫోన్స్ వ‌స్తుంటాయ‌ని, వాళ్లు త‌న ఫోన్ ట్యాప్ చేశార‌ని, త‌న సెక్యూర్టీని కూడా త‌న గురించి అడిగేవార‌ని పేర్కొన్నారు.