ఒలింపిక్స్‌లో తొలి రోజే మీరాబాయ్ చానుకు సిల్వ‌ర్

 ఒలింపిక్స్‌లో తొలి రోజే ఇండియా ప‌త‌కాల బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా, ఇప్పుడు మీరాబాయ్ సిల్వ‌ర్‌తో మెరిసింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్. 
 
స్నాచ్‌, క్లీన్ అండ్ జెర్క్ క‌లిపి ఆమె 202 కేజీల బ‌రువు ఎత్తింది. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హౌ ఝిఝి 210 కేజీల‌తో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇండోనేషియాకు బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కింది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.
 
భారత్ కు తొలి ప‌త‌కాన్ని అందించిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయ్ చానుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షా, మ‌ణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు, అస్సాం, క‌ర్ణాట‌క‌, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర క్రీడా ప్ర‌ముఖులు ట్విట‌ర్లో ఆమెను ప్ర‌శంసించారు. ఇండియాను స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు.
‘‘టోక్యో ఒలంపిక్స్‌లో రజత పతకం గెలిచి, భారత్‌కు బోణీ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు అభినందనలు’’ అంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరాబాయి ప్రదర్శనతో భారత్ ఉప్పొంగుతోంది. రజత పతకం సాధించినందుకు అభినందనలు. ఆమె సాధించిన విజయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమే’’ అని మోదీ పేర్కొన్నారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పోక్ కాచింగ్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల ఈ మణిపురి బాలిక  మిరాబాయి 13 సంవత్సరాల వయసులో తాను  క్రీడాకారిణి కావాలని నిర్ణయించుకుంది. ముందుగా విలువిద్య నేర్చుకోవాలని అనుకొంది.  ఒక ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని, 2008 ప్రారంభంలో, ఆమె బంధువుతో కలిసి ఇంఫాల్‌లోని ఖుమాన్ లంపక్ వద్ద ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి వెళ్లగా, ఆ రోజు ఆమెకు ఎటువంటి ఆర్చర్ శిక్షణ లభించలేదు.

ప్రముఖ మణిపురి వెయిట్ లిఫ్టర్ కుంజారాని దేవి క్లిప్పింగులను చూసిన ఆమె స్ఫూర్తి పొంది కొన్ని రోజుల తరువాత  వెయిట్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది. ఆమె మాజీ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్,  కోచ్ అనితా చానును కలిసి ఆ క్రీడలో చేరింది. ఆమె తన కల నెరవేరడానికి ఆమె శిక్షణ, పాఠశాల చదువును గారడీ చేయడం ప్రారంభించింది.

 
కాగా, భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సౌరభ్‌ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. 
 
మొత్తం 36 మంది పోటీపడగా సౌరభ్‌ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత షూటర్ అభిషేక్‌ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక ఫైనల్స్‌ చేరిన సౌరభ్ అక్కడ కూడా ఇదే దూకుడు కనబరిస్తే భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయం.     
 
ఆర్చ‌రీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు భార‌త్ అర్హ‌త సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్ర‌వీణ్ జాద‌వ్ అద్భుత విజ‌యం సాధించారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ద‌క్షిణ కొరియాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్‌ను దీపికా కుమారి, జాద‌వ్ క‌లిసి ఓడించారు.
 
తొలుత,  ఊహించిన‌ట్లే టాప్ ఫామ్‌లో ఉన్న ఇండియ‌న్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 3-2తో విజ‌యం సాధించింది.