తమిళనాడు ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని అన్నాడీఎంకే మిత్రపక్షమైన బీజేపీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పటిష్టపరచాలని ఆ పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన బీజేపీ నాలుగుచోట్ల గెలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబరులోగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై జిల్లాల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసు కోనున్నారు.
సర్పంచ్‌, నగర పంచాయతీ అధ్యక్షుడు, మున్సిపల్‌ చైర్మన్‌  వంటి పదవులు పొందాలంటే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడమే శ్రేయస్కరమని పార్టీ సీనియర్‌ నాయకులు అన్నామలైకి సూచిస్తున్నారు. ఓ వైపు అన్నాడీఎంకేతో సఖ్యతగా వ్యవహరిస్తూ మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. 
ఈ ఎన్నికల్లో కూటమి అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అన్నామలై ఇటీవల తరచూ జిల్లాల వారీగా కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తూ పార్టీ స్థితిగతులను, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశాన్ని చర్చిస్తున్నారు.
ఆయా జిల్లాల్లో స్థానికంగా పార్టీకున్న బలం, పట్టు, అభ్యర్దికి ఉన్న ప్రజాదరణపై గెలుపు ఆధారపడి ఉంటుందని పలువురు నేతలు ఆయన వద్ద అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అవసరం, అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వాడుకోవడమే మేలని ఎక్కువశాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి లేకుంటే క్షేత్రస్థాయి వరకు కమలం గుర్తుపై పోటీచేసే అవకాశం కలుగుతుంది.