టిఎంసి ఎంపీ రాజ్య‌స‌భ నుంచి స‌స్పెండ్… వెంకయ్య ఆవేదన

కేంద్ర ఐటీశాఖ మంత్రి వైష్ణవ్ ప్రకటన చేస్తున్నప్పుడు రాజ్యసభలో ఆయన నుంచి పత్రాలను లాక్కొని ముక్కలు ముక్కలుగా చేసిన టిఎంసి ఎంపీ శంతను సేన్‌ను నేడు సభ నుండి సస్పెండ్ చేశారు. గురువారం రాజ్యసభలో చోటుచేసుకున్న సంఘటనల పట్ల సభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య  నాయుడు తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. 
 
స‌భ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్రంగా క‌లిచి వేస్తున్నాయ‌ని, దుర‌దృష్ట‌వ‌శాత్తు స‌భా వ్య‌వ‌హారాలు దిగ‌జారిపోయాయ‌ని వెంక‌య్య విచారం వ్యక్తం చేశారు. ఇవాళ రాజ్య‌స‌భ ఉద‌యం స‌మావేశం ప్రారంభం కాగానే  చైర్మెన్ వెంక‌య్య ఈ  ప్ర‌క‌ట‌న చేశారు. అలాంటి ఘ‌ట‌న మ‌న పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యంపై దాడి లాంటి చ‌ర్య‌లే అని వెంక‌య్య స్పష్టం చేశారు. 
 
మంత్రి చేతుల్లోంచి పేప‌ర్లు లాగిన టీఎంసీ ఎంపీ శాంత‌ను సేన్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు. వెంటనే కేంద్ర స‌హాయ మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్‌  సేన్ సస్పెష‌న్‌పై తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. వ‌ర్షాకాల స‌మావేశాలు పూర్తి అయ్యే వ‌ర‌కు సేన్‌ను స‌స్పెండ్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా స‌స్పెన్ష‌న్‌ను తీర్మానించారు.
అయితే ఆ తీర్మానాన్ని తృణ‌మూల్ ఫ్లోర్ లీడ‌ర్ సుఖేందు శేఖ‌ర్ రాయ్ వ్య‌తిరేకించారు. ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వ్య‌తిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. 12 గంట‌ల‌కు స‌భ మ‌ళ్లీ ప్రారంభ‌మైన త‌ర్వాత‌  ఎంపీ శాంత‌ను సేన్ హౌజ్‌లోనే ఉండిపోయారు. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు నిరాక‌రించారు.
తృణ‌మూల్ ఎంపీలు ఆయ‌న‌కు మద్దతు ఇచ్చారు. స‌భ నుంచి వెళ్లిపోవాలంటూ డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ఎంపీ శాంత‌ను సేన్‌ను కోరారు. ఆ త‌ర్వాత స‌భ‌ను అర‌గంట వాయిదా వేశారు.