టీఎంసీ ఎంపీలపై చర్యలకు కేంద్రం ప్రివిలేజ్‌ మోషన్‌

రాజ్య‌స‌భ‌లో గురువారం గంద‌ర‌గోళం సృష్టించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీలపై చర్యలకు ప్రివిలేజ్ మోషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నది. అలాగే టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

పెగాస‌స్ స్పైవేర్ అంశంపై రాజ్యసభలో ప్రకటన చేస్తున్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పట్ల టీఎంసీ ఎంపీలు గురువారం అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి ప్రకటన పత్రాలను లాగారు. ఆ త‌ర్వాత ఆ  పత్రాలను చింపి వెల్‌లో వెద‌జ‌ల్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్, టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్ మ‌ధ్య మాట‌ల ఘ‌ర్ష‌ణ కొన‌సాగింది.

టీఎంసీ ఎంపీల వైఖ‌రిని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఖండించారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాజ్యసభ సభా నాయకుడు పియూష్ గోయల్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వీ మురలీధర్‌లతో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సమావేశమయ్యారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు సృష్టించిన గందరగోళంపై వారితో చర్చించారు.

ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీలపై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. వారిపై ప్రివిలేజ్‌ మోషన్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చేతుల్లోంచి ప్రకటన పత్రాలను లాగిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను ప్రభుత్వం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.