ఢిల్లీలోని రోహింగ్యా క్యాంప్‌ను కూల్చిన యోగి ప్రభుత్వం

భూ ఆక్రమణలను సహించేది లేదంటూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. ఎక్కడ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు వినవచ్చినా తమ బుల్‌డోజర్లను పంపి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నది. అయితే, ఈ కూల్చివేతలు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికే పరిమితం కాకుండా పొరుగునే ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో కూడా కొనసాగించి సంచలనం సృష్టించింది. 

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ఢిల్లీలోని మదన్‌పూర్‌ ఖదర్‌ ప్రాంతంలో 2.10 హెక్టార్లు భూమి ఉన్నది. ఈ భూమి సాగునీటి శాఖ పరిధిలో ఉన్నది. ప్రస్తుత మార్కెట్‌ లెక్కల ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్ల పైమాటే. అయితే, గత కొంతకాలంగా ఈ భూమిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సాగునీటి శాఖ ఆజమాయిషీ లేకపోవడంతో.. అక్కడ రోహింగ్యా క్యాంప్‌ ఏర్పడింది. 

ఈ విషయం తెలుస్తుకున్న యుపి ప్రభుత్వం తమ బుల్‌డోజర్లను పంపి రోహింగ్యా క్యాంప్‌లో వేసిన నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించింది. తమ ప్రభుత్వానికి చెందిన 2.10 హెక్టార్ల భూమి పరుల పరం కాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు యోగి సర్కార్‌ చెప్తున్నది.

రోహింగ్యా క్యాంప్‌ను తొలగించి తమ భూమిని కాపాడాలని గతంలో పలుమార్లు ఉత్తరప్రదేశ్‌ అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. దాంతో తామే నేరుగా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాల్స వచ్చిందని యూపీ ఆర్‌డబ్ల్యూఏ అధికారులు చెప్తున్నారు.

మదన్‌పూర్‌ ఖదర్‌ ఖబ్రస్తాన్‌ ఎదురుగా ఉన్న ఈ ఖాళీ ప్రాంతంలో రోహింగ్యాలు గుడారాలు ఏర్పాటుచేసుకుని ఉంటున్నారు. వీరికి ఢిల్లీ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇక్కడి రోహింగ్యాలకు ఢిల్లీ ప్రభుత్వంతోపాటు ఓఖ్లా శాసనసభ్యుడు అమానుల్లా ఖాన్‌ రేషన్‌ కూడా సరఫరా చేశారు. 

రోహింగ్యా ముస్లింలు భారతదేశ భద్రతకు ముప్పు అని కేంద్ర ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టులో పేర్కొన్నది. ప్రభుత్వం వారిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.