రాజీనామా ఎవ్వరు అడగలేదు… పదవికన్నా పార్టీయే ముఖ్యం

మరో మూడు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బి ఎస్  యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారని  మీడియా కధనాలు వెలువడుతున్న సందర్భంగా ఇప్పటి వరకు తనను రాజీనామా చేయమని ఎవ్వరు కోరలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే ఎప్పుడైతే అధిష్ఠానం రాజీనామా చేయమని ఆదేశిస్తుందో, వెంటనే రాజీనామాకు సిద్ధమని, పార్టీ విస్తరణలో పాలుపంచుకుంటానని ప్రకటించారు. మరోవంక, తన వారసుడిగా ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరునూ సూచించనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకైతే అధిష్ఠానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, జూలై 26 న ఏం జరుగుతుందో మీరే చూడాలంటూ యడియూరప్ప వ్యాఖ్యానించారు. జులై 26న ముఖ్యమంత్రిగా యడియూరప్ప (78) రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.
 26న సోమవారం రెండేళ్ల పాలనపై ‘సాధన’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నామని.. విధాన సౌధలోని బ్యాంకెట్‌హాల్‌లో ఈ కార్యక్రమం సాదాసీదాగానే జరుగుతుందని చీఫ్‌విప్‌ సునీల్‌కుమార్‌ బుధవారం మీడియాకు తెలిపారు.  తనకు సీఎం కుర్చీ ముఖ్యం కాదని, పార్టీ అభివృద్ధే ఎజెండాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని యడ్డీ స్పష్టం చేశారు.

‘మా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఓ కార్యక్రమాన్ని నిర్వించనున్నాం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయాన్ని బట్టి నేను ముందుకెళ్తా. ఆయన ఏం ఆదేశిస్తే దానికి నేను కట్టుబడి ఉంటా’ అని వెల్లడించారు. 

తాను అధికారంలో ఉన్నా లేకపోయినా బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. దీనికి పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించాలని కోరారు. “సీఎం పదవికి సంబంధించి ఆదేశాలు రాగానే దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత పార్టీ కోసం కృషి చేస్తా. నాకు ఏ పనులు అప్పజెప్పినా వాటి కోసం చివరి క్షణం వరకు పని చేస్తా'” అని యడియూరప్ప పేర్కొన్నారు.

పార్టీ అగ్రనాయకత్వం తనపట్ల ఎంతో స్నేహభావంతో ఉంటూ, తనకు ఎంతో గౌరవం ఇస్తూ  వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో 75 ఏళ్ళ వయస్సు మించినవారెవ్వరిని ఎటువంటి పదవులలో ఉండే అవకాశం లేకపోయినా తనకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. 

కాగా తన ముఖ్యమంత్రి పదవి గురించి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవ్వరు ఎటువంటి హడావుడి చేయవద్దని, కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీని బలోపేతం కావించడమే అందరి లక్ష్యంగా ఉండాలని హితవు చెప్పారు.