బిజెపి నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్న మమతా!

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి మమత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. మమత ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు.

ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఎవరితోనూ మాట్లాడడానికి వీలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వాట్సాప్ ద్వారానో, లేదంటే ఫేస్‌టైమ్ అన్న యాప్ ద్వారానో మాట్లాడుకోవడమే అవుతోందని మండిపడ్డారు. కేవలం తన ఫోన్లు మాత్రమే కాదని, బీజేపీ నేతలందరి ఫోన్లనూ మమత ట్యాప్ చేయిస్తోందని సుబేందు మండిపడ్డారు.

ఇక బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మమత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఎంసీ నేతల ఫోన్లను కూడా మమతా బెనర్జీ ట్యాప్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని, అందుకే కేవలం వాట్సాప్‌లోనే మాట్లాడుకుంటున్నారని దిలీప్ ఘోష్ ఆరోపించారు.

మమత ప్రభుత్వం పెగాసస్ సాంకేతికతను ఉపయోగించి ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఫోన్లను ట్యాప్ చేయడం బీజేపీ పనికాదని, అది కాంగ్రెస్ సంస్కృతే అని దిలీప్ ఘోష్ ధ్వజమెత్తారు. ఆ కాంగ్రెస్ నుంచే మమత కూడా వచ్చారని, అందుకే ఆమె రాష్ట్రంలోని నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు.

ఇలా ఉండగా,  మ‌మ‌తాబెన‌ర్జి.. మ‌హ్మ‌ద్ అలీ జిన్నా బాట‌లో న‌డుస్తున్నార‌ని దిలీప్ ఘోష్ విమర్శించారు. స్వతంత్రంకు ముందు జిన్నా క‌ల‌క‌త్తాలో మ‌త‌క‌ల్లోలాలు రేపి 20 వేల మంది చావుకు కార‌ణ‌మ‌య్యాడ‌ని, ఇప్పుడు మ‌మ‌తాబెన‌ర్జి సైతం అవే విధానాల‌ను అనుస‌రించి బెంగాల్‌ను బంగ్లాదేశ్‌గా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని దుయ్యబట్టారు.

మ‌మ‌తాబెన‌ర్జి ఖేలా దివ‌స్ నిర్వ‌హ‌ణ వెనుక ఉద్దేశం ఇదేన‌ని ఆయ‌న ఆరోపించారు. ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం రాష్ట్రంలో 12 వేల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని, బీజేపీకి చెందిన 45 మంది కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు కోల్పోయార‌ని దిలీప్ ఘోష్ చెప్పారు.