రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధం

రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధం

రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మరోమారు స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల్లోని సమస్యలను అంశాల వారీగా తెలియజేస్తే వాటిపై చర్చలు జరుపుతామని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమని, వారికి ఎంతో లబ్ధి కలిగిస్తాయని మరోసారి వెల్లడించారు.

 పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రైతులు సిద్ధమైన నేపథ్యంలో వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. మరోవైపు జంతర్‌ మంతర్‌ వద్దకు చేరిసన రైతులు గురువారం అక్కడ ‘రైతు పార్లమెంట్‌’ను నిర్వహించారు.

వ్యవసాయ చట్టాలపై నిరసనలో అమరులైన అన్నదాతలకు నివాళి అర్పించారు. కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మరోసారి డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరిగే వరకు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు.

రైతుల నిరసనకు మద్దతుగా కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ తదితర పక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో గత ఎనిమిది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్నారు.

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతు పార్లమెంట్‌ నిర్వహించాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిరోజు 200 మందితో రైతు పార్లమెంట్‌ జరిపేందుకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ అనుమతి ఇచ్చింది