తెలంగాణలో భారీ వర్షాలు, ప్రాజెక్ట్ లలో భారీగా వరద నీరు

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అన్ని ప్రాజెక్ట్ లలో వరద నీరు భారీగా చేరుతున్నది.  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 
 
రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి.   మంగళవారం నుంచి న‌గ‌రంలో ప్రారంభ‌మైన ముసురు ఆగ‌డం లేదు. విరామం లేకుండా ముసురు ప‌డుతుండ‌టంతో న‌గ‌ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధ‌వారం రోజు న‌గ‌రంలో 17.7 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, అత్య‌ధికంగా కాప్రాలో 30.5 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 
 
 తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా  ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు.  
 
బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని, అక్కడికి ఎన్డీఅరెఫ్ బృందాలను తక్షణమే పంపాలని సిఎస్ సోమేశ్ కుమార్ కు కెసిఆర్ సూచించారు.
 
ప్రజలకు ఎటువంటి సమస్యలకు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను ,ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కెసిఆర్ కోరారు. భారీ వర్షాలు పడుతున్నందున రాష్ట్రంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు  గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడిందని, అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం  ఉందని, వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.