పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. యూపిఏ హయాంలో నాటి ఆర్ధికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫోన్లపై సోనియా ఆదేశాల మేరకు నాటి హోం మంత్రి చిదంబరం ట్యాపింగ్ చేస్తే నాటి ప్రధాని మన్మోహన్‌కు ప్రణబ్ లేఖ రాశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం తగదంటూ ప్రతిపక్షాలకు ఆమె చురకలంటించారు. పెగాసస్ నుండి ఎలాంటి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చెయ్యలేదని భారత ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందిని, పెగాసస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందని ఆమె గుర్తు చేశారు.
కొన్ని ఎన్జీవోలకు వస్తున్న విదేశీ నిధులపై నియంత్రణ ఏర్పడిన దృష్ట్యా, ఆ సంస్థలు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అసలు ఏం జరిగిందనే విషయమై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ప్రణబ్ లేఖను బాగా గుర్తుంచుకోవాలని ఆమె హితవు చెప్పారు.
2010లో జరిగిన ఇండియన్ కార్పోరేట్ వీక్ సదస్సులో నాటి ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ… పన్నులు ఎగ్గొట్టే కార్పోరేట్ సంస్థలు, హవాలా కార్యకలాపాలు, జాతీయ భద్రత తదితర అంశాల్లో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చెయ్యడాన్ని సమర్ధించుకున్నారని ఈ సందర్భంగా విజయశాంతి ప్రస్తావించారు.
గత యుపిఎ-2 సర్కారు హయాంలో సుమారుగా 7 వేలకు పైగా ఫోన్లు, దాదాపు 500 ఈమెయిల్ అకౌంట్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టినట్టు 2013 నాటి ఒక ఆర్టీఐ దరఖాస్తుకు బదులు వచ్చింది. ఆ చర్యలన్నిటికీ సాక్ష్యాలున్నాయి. కానీ, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న నేతలు నేడు కేంద్ర ప్రభుత్వంపై నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉందని విజయశాంతి ధ్వజమెత్తారు.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి