ప్రజాస్వామ్యం గొంతు నులుముతున్న ప్రతిపక్షాలు 

పార్లమెంటులో ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో రసాభాస సృష్టిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యం గొంతు నులమడం వంటిదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశానికి, ప్రజలకు ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంతో నిరంతరం ఆడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. గ్రామాలు, పేదలు, యువత, మహిళల సంక్షేమం కోసం చర్చలు జరగవలసి ఉందని చెప్పారు.
చాలా ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగవలసి ఉందని తెలిపారు. అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు.  ప్రతిపక్షాలు ఈ కుట్రను పన్నాయని ఆరోపించారు. ఉద్యమం పేరుతో రైతులను విశ్వాసాలు, మతాలతో లంకె పెడుతున్నారని ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులను పార్లమెంటుకు పరిచయం చేసేందుకు ఉపక్రమించినపుడు ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. 

ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఈ విధమైన గలాభా సృష్టించకుండా, కొత్త మంత్రులను కరతాళ ధ్వనులతో గౌరవిస్తారని ఆశించానని చెప్పారు. దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులవుతూ ఉంటే పార్లమెంటులో కూర్చున్నవారిలో చాలా మందికి ఇష్టం లేనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.