సిఎఎ, ఎన్‌ఆర్‌సిలు హిందూ-ముస్లిం అంశమే కాదు

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరత్వ సవరణ చట్టం (సిఎఎ),  నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)లకు దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం వివాదంతో ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్  డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు వీటిని కేవలం ముస్లిం జనాభాను తగ్గించడం కోసం ఉద్దేశించినట్లు వారిలో దురభిప్రాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రెండు రోజుల అస్సాం పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం గౌహతిలో డా. నాని గోపాల్ మహంత వ్రాసిన “సిఎఎ, ఎన్‌ఆర్‌సి చర్చ” గ్రంధాన్ని ముఖ్యమంత్రి మహంత్ బిస్వాస్ శర్మతో కలసి ఆవిష్కరించారు. కొందరు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఈ రెండు అంశాలపై మతపరమైన కధనాలు వ్యాప్తి చేస్తున్నారని ఈ సందర్భంగా డా. భాగవత్ ఆరోపించారు.
పౌరసత్వ చట్టం వల్ల ఏ ఒక్క ముస్లింకూ నష్టం జరగదని ఆయన స్పష్టం చేస్తూ ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల పేరిట కొందరు  అవకాశవాదులు హింస, విధ్వంసములకు కారణం అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అల్లర్లు, ఘర్షణలు రెచ్చగొట్టడం కోసం కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని హెచ్చరించారు.
“స్వాతంత్య్రం వచ్చిన తరువాత, దేశంలోని మొదటి ప్రధాన మంత్రి మైనారిటీలను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, అది  ఇప్పటివరకు జరుగుతూ వస్తున్నది. మేము దీనిని కొనసాగిస్తాము. సిఎఎ వల్ల ఏ ముస్లిం అయినా నష్టాన్ని ఎదుర్కోరు” అని ఆయన భరోసా ఇచ్చారు.
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంవ‌ల్ల దేశంలోని ముస్లింల‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని పేర్కొంటూ భార‌తీయ ముస్లింల‌ను కాపాడుకుంటామ‌ని దేశ విభ‌జ‌న స‌మ‌యంలో భార‌త్ హామీ ఇచ్చింద‌ని, భార‌త్ ఆ హామీకి ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని చెప్పారు. అయితే పాకిస్థాన్‌లో హిందువుల‌కు ర‌క్షణ క‌ల్పిస్తామ‌న్న హామీని ఆ దేశం నిల‌బెట్టుకోలేద‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ విమ‌ర్శించారు.

పౌరసత్వ చట్టం పొరుగు దేశాలలో హింసకు గురైన మైనారిటీలకు రక్షణ కల్పిస్తుందని ఆయన తెలిపారు. “విపత్తు సమయంలో ఈ దేశాలలో కూడా మనం మెజారిటీ వర్గాలకు చేరుకుంటాము. కాబట్టి బెదిరింపులు,  భయం కారణంగా మన దేశానికి రావాలని కోరుకునే వారు కొందరు ఉంటే, మనం వారికి ఖచ్చితంగా సహాయం చేయాల్సి ఉంటుంది” అని భగవత్ స్పష్టం చేశారు.

ఎన్‌ఆర్‌సి గురించి మాట్లాడుతూ, తన పౌరులు ఎవరో తెలుసుకునే హక్కు అన్ని దేశాలకు ఉందని ఆయన తెలిపారు. “ప్రభుత్వం ఇందులో పాలుపంచుకున్నందున ఈ విషయం రాజకీయ రంగంలో ఉంది … ఈ రెండు సమస్యల చుట్టూ ఒక వర్గ కథనాన్ని సృజనాత్మకంగా సృష్టించడం ద్వారా రాజకీయ మైలేజీని పొందాలని ఒక వర్గం కోరుకుంటుంది” అని ఆయన చెప్పారు. 

బాంగ్లాదేశ్, పాకిస్థాన్ ల నుండి వలస వచ్చే ముస్లిమేతరులకు భారత పురసత్వం కల్పించే పక్రియను సులభతరం చేసే పౌరసత్వ సవరణ చట్టంపై స్వయంసేవకలు చాలాకాలంగా కోరుకొంటున్నారని చెబుతూ “మనం ఎప్పుడు మొత్తం మానవాళి సంఘకు చెందినవారే అని ఆలోచిస్తుంటాము” అని ఆర్ ఎస్ ఎస్ అధినేత వివరించారు. 
లౌకికవాదం, సామాజిక వాదం, ప్ర‌జాస్వామ్యం గురించి మ‌నం ప్ర‌పంచ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని డా.  భ‌గ‌వ‌త్ స్పష్టం చేశారు. అవ‌న్నీ మ‌న సాంప్ర‌దాయాల్లో, మ‌న ర‌క్తంలో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. లౌకిక‌వాదం, సామాజిక‌వాదం, ప్ర‌జాస్వామ్యం లాంటి మ‌న దేశం ఎప్ప‌టి నుంచే పాటిస్తూ, ఇప్ప‌టికే ఆచ‌ర‌ణ‌లోనే ఉంచింద‌ని చెప్పారు.