కరోనా మహమ్మారిపై రాజకీయాలకు అతీతంగా పోరాడదాం

కరోనా మహమ్మారిపై పోరులో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్టాలు కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నియంత్రణపై మంగళవారం మూడు గంటలసేపు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కరోనా మహమ్మారి సమయంలో చేసిన కృషిని ప్రభుత్వం వివరించింది. 

ప్రస్తుత సమయంలో రాజకీయ అంశాలు తెరపైకి రావద్దని ప్రధాని హెచ్చరిస్తూ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒలింపిక్ లో భారత్ క్రీడాకారుడు ఒకరు ఒక పతాకం సాధించారు అంటే ఆ ఘనత కేవలం అధికార పార్టీకి లేదా ఏదో ఒక పార్టీకి చెందదని, మొత్తం దేశంపై చెందుతుందని స్పష్టం చేశారు. 

అదే విధంగా భారత్ కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తే ఆ కీర్తి ఒక ప్రభుత్వానికి లేదా ఒక పార్టీకి చెందదని, మొత్తం దేశ ప్రజలు కలసి సాధించిన విజయం కాగలదని తెలిపారు. 

మోదీ మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో జనాభా నిష్పత్తిపరంగా చాలా ఇతర దేశాల కంటే భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. బ్రిటన్‌ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభించడాన్ని ప్రస్తావిస్తూ అలసత్వం పనికిరాదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరికొన్ని కంపెనీల వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతూ దానికోసం కేంద్రం కృషిని వివరించారు.

కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆప్, ఆర్జేడీ, అకాలీదళ్ ప్రతినిధులు సమావేశానికి గైరాజరు కాగా, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్ వాల్డ్ పార్టీ, శివసేన, డీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు. 

సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి భారత్ భూషణ్ కరోనా మహమ్మారి పరిస్థితి గురించి వివరించారు. ఈ సమావేశానికి గైరాజరు కావడం పట్ల కాంగ్రెస్ సభ్యులలో చీలిక ఏర్పడినట్లు కనపడుతున్నది. గైరాజరు కావాలని పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. 

ఈ విషయమై ప్రజలలో ఇటువంటి జాతీయ ప్రాధాన్యత గల అంశంపై తప్పుడు సంకేతాలు పంపినట్లు కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడం కోసం తాము సమావేశాన్ని బహిష్కరింపలేదని, కేవలం సభా నాయకులను కాకుండా ఎంపీలు అందరిని పిలవమని మాత్రమే కోరామని అంటూ రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. 

మరోవైపు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ గుర్తింపు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేడీ, టీఎంసీ కోరాయి. రెండో వేవ్ గ్రామీణ ప్రజలను ఎక్కువగా బాధిస్తున్నదని చెబుతూ టీకాల కార్యక్రమం మరింత ముమ్మరం చేయాలని టిఎంసి నేత నామా నాగేశ్వరరావు సూచించారు. 

కేంద్ర మంత్రులు  అమిత్ షా, రాజనాథ్ సింగ్, పీయూష్ గోయల్, ముఖ్తహార్  అబ్బాస్ నక్వీ,  ఎన్సీపీ అధినేత శరద్ పవర్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, బిజెడి నేత పినాకి మిశ్రా, డీఎంకే నేత తిరుచ్చి శివ, ఆర్ ఎస్ పి  నేత ఎన్ కె ప్రేమచంద్రన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

ప్రధాని సోమవారం ఉదయం లోక్ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులకు తాను కరోనా మహమ్మారి గురించి సమగ్ర సమాచారం ఇవ్వదలచానని, మంగళవారం సాయంతం కొంత సమయం కేటాయించామని కోరారు. ఈ అంశంపై పార్లమెంట్ లోపల, బయట ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.