పార్లమెంట్‌ సమావేశాలప్పుడే ‘పెగాసస్‌’ కథనం ఎందుకు?

పార్లమెంట్‌ సమావేశాలప్పుడే ‘పెగాసస్‌’ కథనాన్ని ఎందుకు బయటకు తెచ్చారని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. సమావేశాలను పక్కదారి పట్టించే కొత్త వాతావరణాన్ని సృష్టించేందుకు పథకం ప్రకారం ఈ నివేదికను విడుదల చేశారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ పోర్టల్ ‘ది వైర్’ పేరు కూడా బయటకు వచ్చిందని చెబుతూ  అయితే వారి కథనాలు చాలా తప్పు అని తేలిందని, ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇది ఒక వింత పరిస్థితి అని రవి శంకర్‌ ప్రసాద్‌ అభివర్ణించారు. పెగసాస్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లోని అంశాలను ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ సంస్థ తిరస్కరిస్తోందని తెలిపారు.

ఆ సంస్థ ఉత్పత్తులను చాలా వరకు పాశ్చాత్య దేశాలు ఉపయోగిస్తున్నాయని, అయితే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ సంస్థ పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. ఈ రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చినవారు సంబంధిత వ్యక్తుల హ్యాక్‌ ఫోన్‌ నంబర్లు ఆ డేటాబేస్‌లో ఉన్నట్లుగా నిర్ధారించలేదని గుర్తు చేశారు.

బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లుగా నిరూపించే సాక్ష్యాలు కూడా ఈ కథనంలో లేవని స్పష్టం చేశారు. పైగా, అమ్నెస్టీ వంటి సంస్థలు అనేక విధాలుగా భారత వ్యతిరేక ఎజెండాను ప్రకటించాయని, దీనిని మనం తిరస్కరించగలమా? అని ప్రశ్నించారు. వారి నిధుల వనరును అడిగినప్పుడు, “భారతదేశంలో పనిచేయడం కష్టం” అని వారు అంటారని విమర్శించారు.

దేశంలో ముఖ్యమైన సంఘటనలు జరిగే సమయంలోనే ఈ రకమైన ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతాయని రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ట్రంప్ భారత్‌ పర్యటన సందర్భంగా అల్లర్లను ప్రేరేపించారని, 2019 ఎన్నికల సమయంలో కూడా పెగాసస్‌ కథనాన్ని ప్రసారం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ చాలా చెడ్డ పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ పెగాసస్‌ కథనం తెరపైకి వచ్చిందని ఎద్దేవా చేశారు.