ద‌ళితులు, మ‌హిళ‌లు మంత్రులైతే కొంద‌రికి న‌చ్చ‌డంలేదు

పార్లమెంట్ లో అర్ధవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా ఉభయ సభల వర్షాకాల సమావేశాలు తొలిరోజు గందరగోళ మధ్య ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను జరగనీయక పోవడం పట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా కొత్త మంత్రులను పరిచయం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్ర‌తిప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్యే.. ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ  దేశానికి చెందిన ద‌ళితులు, మ‌హిళ‌లు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్ర‌తిప‌క్షాల‌కు సంతోషంగా లేద‌ని ధ్వజమెత్తారు. 
 
పార్ల‌మెంట్‌లో ఉత్సాహ వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని అనుకున్నాన‌ని, కొత్త మ‌హిళా, ద‌ళిత ఎంపీల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎంపీల‌ను పరిచ‌యం చేయాల‌నుకున్నానని, కానీ కొంద‌రికి మాత్రం ద‌ళిత ఎంపీలు మంత్రులు కావ‌డం న‌చ్చ‌డం లేద‌ని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్య‌వ‌సాయ‌, గ్రామీణ నేప‌థ్యం ఉన్న‌వారు మంత్రులు అయిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. 
 
రాజ్య‌స‌భ‌లో ప్రధాని మాట్లాడుతూ రైతు బిడ్డ‌ల్ని స‌భ‌లో ప‌రిచ‌యం చేసే శుభ‌సంద‌ర్భం ఇద‌ని, కానీ కొంద‌రు స‌భ్యులు దాన్ని అవ‌హేళ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని ఆరోపించారు. కొత్త మంత్రుల‌ను స‌భ‌కు మోదీ ప‌రిచ‌యం చేస్తున్న వేళ‌.. విప‌క్ష స‌భ్యులు గంద‌ర‌గోళం సృష్టించారు. అరుపులు, కేక‌లు, నినాదాలు చేశారు. 
 
పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు, ఎస్సీ వర్గానికి చెందిన‌వాళ్లు, ఆదివాసీలు మంత్రుల‌య్యార‌ని మోదీ చెబుతూ  అణ‌గారిని వర్గానికి పెద్ద‌పీట వేస్తుంటే, కొంద‌రు స‌హించ‌డంలేద‌ని మండిపడ్డారు. ఇదేం ర‌క‌మైన మాన‌సిక స‌మ‌స్యో అర్థం కావ‌డం లేద‌ని దుయ్యబట్టారు. ద‌ళితుల వైభ‌వాన్ని ఎందుకు విప‌క్ష స‌భ్యులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రశ్నించారు. తొలిసారి స‌భ‌లో ఇలాంటి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న‌ద‌ని ఆయ‌న విస్మయం వ్యక్తం చేశారు.
 
‘‘మహిళలు, దళితులు, గిరిజనులను ఎక్కువ సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాం. మరికొందరిది వ్యవసాయ సంబంధిత నేపథ్యం, మరికొందరిది గ్రామీణ నేపథ్యం… ఈ నేపథ్యాన్ని చూసి సభ్యులందరూ తెగ సంతోషాన్ని వ్యక్తం చేశారని భావించా. వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ప్రోత్సహిస్తారని భావించా. కానీ… వారందర్నీ చూస్తే కొందరికి జీర్ణం కావడం లేదు. అందుకే వారిని పరిచయం చేస్తానంటే అడ్డుతగులుతున్నారు. వారంతా మహిళా ద్రోహులు’’ అంటూ మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 
తీవ్రంగా మండిపడ్డ రాజ్‌నాథ్, గోయల్

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేస్తున్న సందర్భంలో విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, పీయూశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొలపడమే పార్లమెంట్‌కు గొప్ప బలమని, అటు విపక్ష సభ్యులైనా, అధికార పక్షమైన ఈ వాతావరణానికి సహకరించాలని కోరారు. 

ప్రధాని కొత్త వారిని పరిచయం చేస్తున్న సందర్భంగా విపక్ష నేతలు ఇలా నినాదాలు చేయడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని, పూర్తి అనారోగ్యకరమైన వాతావరణమని రాజ్‌నాథ్ దుయ్యబట్టారు. మరోవైపు రాజ్యసభా పక్ష నేత పీయూశ్ గోయల్ కూడా విపక్ష నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఇదే ప్రథమం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను పరిచయం చేయడం ఎప్పటి నుంచో వస్తున్న సభా సంప్రదాయం. మహిళలు, దళితులు ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేసే సమయంలో విపక్ష నేతలు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం’’ అని పీయూశ్ గోయల్ మండిపడ్డారు. 

మరోవంక, మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనలపై చర్చించాలని కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌, సిపిఎం, ఆర్‌ఎల్‌పి, డిఎంకె, బిఎస్‌పి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. శిరోమణి అకాలీదళ్‌ తరుపున బతిందా ఎంపి హర్‌స్రిమత్‌ కౌర్‌ బాదల్‌ తీర్మానాన్ని అందించారు. దీనిపై డిఎంకె నేత (టి ఆర్‌ బాలు), బిఎస్‌పి, సిపిఎం, ఆర్‌ఎల్‌పి (హనుమన్‌ బనివాల్‌) సంతకాలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపి మనీష్‌ తివారీ సైతం వాయిదా తీర్మానం ఇచ్చారు
 
ఇలా ఉండగా, పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేపు ఉభ‌య‌స‌భ‌ల ఫ్లోర్ లీడ‌ర్స్‌తో స‌మావేశం కానున్నారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్స్ ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. దేశంలో కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ పాల‌సీపై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ఈ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు.

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా నఖ్వి
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి నియమితులయ్యారు. రాజ్యసభ సభానేతగా పీయూష్ గోయల్ నియమితులు కావడంతో, ఆయన స్థానంలో డిప్యూటీ లీడర్‌గా నఖ్వి నియామకం జరిగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వికి పార్లమెంటరీ వ్యవహారాలపై విశేషానుభవం ఉంది.
మోదీ తొలి ఐదేళ్ల పాలనలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఆయన సేవలందించారు. అనేక అంశాలపై అధికార పక్షాన్ని సభలో నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న తరుణంలో వివిధ పార్టీల నేతలతో సుహృద్భావ సంబంధాలున్న నఖ్విని డిప్యూటీ లీడర్‌గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.