ఆ కేంద్ర మంత్రి తల్లితండ్రులు ఇంకా వ్యవసాయ కూలీలే!

గ‌ల్లీలోని చోటామోటా లీడ‌ర్ తాలూకు బంధువులు కూడా కార్ల‌లో తిరుగుతూ కాల‌రెగ‌రేసే రోజులివి. అలాంటిది ఓ కేంద్ర మంత్రి త‌ల్లిదండ్రులు ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయ కూలీలుగా జీవిస్తున్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా? కానీ ఈ మ‌ధ్యే కేంద్ర మంత్రిగా ప్ర‌మాణం చేసిన ఎల్ మురుగ‌న్‌ తల్లిదండ్రులు వ‌రుద‌మ్మాళ్‌, లోగ‌నాథ‌న్‌ మాత్రం త‌మ త‌న‌యుడి హోదాతో త‌మ‌కు ప‌నిలేద‌న్న‌ట్లుగా ఎంతో సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారు.

కొడుకు కేంద్ర మంత్రి అయినా కూడా ఇలాంటి జీవితం ఎందుకు గ‌డుపుతున్నారని ప్ర‌శ్నిస్తే.. నా కొడుకు కేంద్ర మంత్రి అయితే నేనేం చేయాలి? అని ఆమె ప్ర‌శ్నించ‌డం విశేషం. ఆయ‌న మోదీ కేబినెట్‌లో కేంద్ర‌మంత్రి అయినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. అయితే ఆయ‌న కెరీర్‌లో ఎద‌గ‌డానికి మేము చేసింది ఏమీ లేదు అంటూ ఈ త‌ల్లిదండ్రులు ఎంతో విన‌మ్రంగా స‌మాధాన‌మిచ్చారు.

వీళ్ల‌ది ఓ ద‌ళిత కుటుంబం. ఇప్ప‌టికీ ఓ రేకుల ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్ద‌రూ రోజు కూలీలే. అంగుళం భూమి కూడా లేదు. రోజూ కూలీనాలీ చేసుకుంటేనేగానీ పూట గ‌డ‌వ‌దు. ఒక‌ప్పుడైతే స‌రేగానీ.. ఇప్పుడు కొడుకు కేంద్ర మంత్రి అయినా కూడా వీళ్లు ఇలాంటి జీవిత‌మే గ‌డుపుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. మురుగ‌న్ ఈ మ‌ధ్యే కేంద్ర కేబినెట్‌లో మ‌త్స్య‌శాఖ స‌హాయ మంత్రిగా ప్ర‌మాణం చేశారు.

త‌మ త‌న‌యుడు కేంద్ర మంత్రి అయ్యాడ‌న్న వార్త కూడా లోగ‌నాథ‌న్‌, వ‌రుద‌మ్మాళ్ దంప‌తుల‌కు పొరుగు వాళ్లు చెబితే కానీ తెలియ‌దు. ఈ శుభ‌వార్త వ‌చ్చిన స‌మ‌యంలో వాళ్లు పొలం ప‌నుల్లో ఉన్నారు. అది విన్న త‌ర్వాత కూడా ఏమీ ప‌ట్ట‌న‌ట్లు త‌మ ప‌ని తాము చేసుకున్నారు.

 తమిళనాడులో సాధారణ కుటుంబానికి చెందిన ఎల్‌ మురుగన్‌ రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆయన కష్టాన్ని, ప్రతిభను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి పదవి ఇచ్చారు.

గ‌తేడాదిలో మురుగ‌న్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మితులైన త‌ర్వాత ఓ భారీ కాన్వాయ్‌తో సొంతూరుకు వ‌చ్చారు. కార్య‌క‌ర్త‌లు, పోలీసుల హ‌డావిడి మ‌ధ్య హంగూ,ఆర్భాటాల‌తో ఆయ‌న వ‌స్తే.. వీళ్లు మాత్రం సింపుల్‌గా వెళ్లి కొడుకును క‌లిసి వ‌చ్చారు. త‌న‌తోపాటు చెన్నైకి వ‌చ్చి ఉండ‌మ‌ని మురుగ‌న్ ఎన్నిసార్లు కోరినా వాళ్లు మాత్రం విన‌రు. ఎప్పుడో ఓసారి వెళ్లినా.. నాలుగు రోజుల ఉండేసి.. ఇక అక్క‌డి బిజీ లైఫ్ న‌చ్చ‌క తిరిగి సొంతూరుకు వ‌చ్చి కూలీనాలీ చేసుకుంటారు.

త‌మ చిన్న కొడుకు ఐదేళ్ల కింద‌ట చ‌నిపోవ‌డంతో ఆయ‌న భార్య‌, పిల్ల‌లు కూడా వీళ్ల‌తోనే ఉంటున్నారు. మురుగ‌న్ స్కూల్ అంతా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే గ‌డిచినా.. కాలేజీ చ‌దువుల కోసం మాత్రం వీళ్లు అప్పులు చేయాల్సి వ‌చ్చింది.

త‌మ కొడుకు కేంద్ర మంత్రి అయ్యాడ‌న్న గ‌ర్వం వీళ్ల‌లో మ‌చ్చుకైనా క‌నిపించ‌ద‌ని ఊళ్లో వాళ్లు చెబుతున్నారు. ఆ మ‌ధ్య రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా సాయం అందజేస్తే.. మురుగ‌న్ తండ్రి లోగ‌నాథ‌న్ లైన్‌లో నిల‌బ‌డి వాటిని తెచ్చుకోవ‌డం విశేషం. మా కొడుకు ఓ ఉన్న‌త స్థానంలో ఉన్నాడు. త‌ల్లిదండ్రులుగా ఇంత‌కన్నా మాకు కావాల్సింది ఏముంటుంది అని ఈ దంప‌తులు అంటున్నారు.

చెన్నైలో అంబేద్కర్ లా కాలేజీలో మురుగన్ లా పూర్తి చేసుకుని కొన్నాళ్లు లాయర్‌‌గా ప్రాక్టీస్ చేశారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ, ఆర్‌‌ఎస్‌ఎస్‌లో యాక్టివ్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. క్రమంగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థాయికి వచ్చారు.

మురుగన్ కుటుంబానికి సంబంధించిన ఈ కథనం జాతీయ పత్రికల్లో రావడంతో దానిని ప్రతిపక్ష శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తన ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. ‘‘హృదయాన్ని హత్తుకునే స్టోరీ, కొడుకు ఎల్‌ మురుగన్ కేంద్ర మంత్రి అయినా సరే ఆయన తల్లిదండ్రులు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. హ్యాట్సాఫ్” అంటూ ఆమె పోస్ట్ చేశారు.