ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్న టీచర్లు 

చిన్న వయసులోనే ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్న నలుగురు టీచర్లను జమ్ముకశ్మీర్‌ పోలీసులు గుర్తించారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి వారిలో ఈ ఉపాధ్యాయులు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నట్లు కనిపెట్టారు.

అనంతనాగ్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉగ్రవాద పాఠాలను బోధిస్తూ చిన్నారులను జిహదీలు, తాలిబాన్లుగా తయారుచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారించి గత వారం ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేసినట్లు ఆలస్యంగా తెలిసింది.

ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవంటూ జమ్ముకశ్మీర్‌ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇలాంటి వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేసేంతగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

 గత మూడు నెలల కాలంలో ఇలాంటి 17 మందిని గుర్తించి ఇంటికి పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో నలుగురు అధ్యాపకులతోపాటు మరో 11 మందిని అధికారులు గత వారం గుర్తించారు. 

ఉపాధ్యాయులు నిసార్‌ తాంత్రే, మహ్మద్‌ జబ్బార్‌ పర్రే, రజియా సుల్తాన్‌, సకినా అక్తర్‌ లను ఉద్యోగాల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ నలుగురు ఉపాధ్యాయులే కాకుండా ఈ ప్రాంతంలో మరో నాలుగు వేల మంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికుడు ఫయాజ్‌ వనీ తెలిపారు.

కశ్మీరీలు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ దేశానికి వ్యతిరేకంగా జిహదీకి పిలుపునిస్తారని, ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఫయాజ్‌ వనీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారినందరినీ ఏరివేస్తేగానీ కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనదని ఇక్కడి వారంటున్నారు.