విదేశీ క్రైస్తవ సంస్థ కార్యకలాపాలపై హైకోర్టు నోటీసులు

‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ అనే విదేశీ క్రైస్తవ సంస్థ భారతదేశంపై కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు స్వీకరించింది. ఈ   అంశంలో 6 వారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా  మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన అమెరికా ప్రభుత్వరంగ సంస్థ (United States Commission on International Religious Freedom – USCIRF)కు తప్పుడు నివేదికలు పంపిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న విషయాన్ని గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వెలుగులోకి తెచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శిబు థామస్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ, జాతీయ బాలల హక్కుల కమీషన్లకు ఫిర్యాదు చేసింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్.. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాల్సిందిగా భోపాల్ డీఐజీని గతంలోనే ఆదేశించింది.
అయితే కేవలం ఐపీఎస్ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం కేసు) కింద FIR నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ భోపాల్ హైకోర్టును ఆశ్రయించింది. పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థపైనా, దాని అధ్యక్షుడు శిబూ థామస్ పైనా ఐపీసీ సెక్షన్ 124A క్రింద దేశద్రోహం కేసు నమోదు  కోర్టును అభ్యర్ధించింది. కేసును పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు జాతీయ బాలల హక్కుల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది.
ఈ అంశంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యక్షులు ఎ.ఎస్. సంతోష్ స్పందించారు. పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ భారతదేశాన్ని Countries of Particular Concern జాబితాలో చేర్చేందుకు అక్కడి ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFతో కలిసి కుట్రచేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన FIACONA వంటి సంస్థలతో చేతులు కలిపి భారతదేశ గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా తప్పుడు నివేదికలు సృష్టించి ప్రపంచ దేశాల సంస్థలకు సమర్పిస్తోందని అన్నారు.