పార్లమెంట్‌ వద్ద రైతుల నిరసనకు అనుమతి నిరాకరణ

 
పార్లమెంట్‌ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్‌ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్‌ వద్ద నిరసన చేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ఇటీవల ప్రకటించింది. 
 
ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్పున 40 రైతు సంఘాల తరుఫున సుమారు 200 మంది రైతులు ప్రతి రోజు పార్లమెంట్‌ వద్ద నిరసనలో పాల్గొంటారని తెలిపింది.  రైతులు  నిరసన చేపట్టకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు రైతు సంఘాలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం సంఘాల నేతలతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా రైతు నేత శివకుమార్‌ కక్కా మాట్లాడుతూ సింగు సరిహద్దు నుంచి పార్లమెంట్‌కు ప్రతి రోజు 200 మంది రైతులు కవాతు నిర్వహిస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నిరసనకారుడికి గుర్తింపు ఉంటుందని, వారి జాబితా సైతం ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు.
 
రైతుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఏడు మెట్రో రైల్వేస్టేషన్ల పోలీసులు అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్లను ఢిల్లీ పోలీసుల నిఘా ఉంచాలని, అవసరమైతే వాటిని మూసివేయడానికి సన్నాహాలు చేయాలని డీఎంఆర్‌సీకి లేఖ రాశారు. ఇందులో జన్‌పథ్, లోక్ కల్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, ఉద్యోగ్ భవన్ స్లేషన్లు ఉన్నాయి.