ముంబైలో భారీ వర్షాలతో జలవిలయం…33 మంది మృతి

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి. వర్షాల ధాటికి పాత ఇళ్లు కుప్పకూలిన ఘటనలలో మొత్తం 30 మందికి పైగా దుర్మరణం చెందారు. ఓ వైపు ఇప్పటికీ కరోనా కడగండ్లు వీడకుండా ఉన్నదశలోనే ముంబై, మహరాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో చాలా రోజులుగా వర్షాలు భయానక పరిస్థితిని సృష్టించాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంతాపం తెలిపారు.

ముంబైలో శనివారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు వీడకుండా పడుతూ వచ్చాయి. దీనితో అనేక చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు జలాశయాలు అయ్యాయి. మనుష్యులు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో సబర్బన్ రైళ్లు, ద్విచక్ర ఇతరత్రా వాహనాల రాకపోకలు దాదాపుగా స్తంభించిపొయ్యాయి. బతుకు చక్రం మొరాయించింది. వాణిజ్య కార్యకలాపాలకు బ్రేక్ పడింది.

పశ్చిమ, మధ్య రైల్వే కొద్ది సేపు రైళ్లను నిలిపివేశాయి. దీనితో రైళ్లకోసం స్టేషన్లకు చేరిన ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరం అయింది. దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను నిలిపివేయడం లేదా నియంత్రించడం జరిగింది. ఓ గుట్టపై భాగంలో ఉన్న కొన్ని ఇళ్లపైకి వర్షాలతో తడిసిన ఓ భారీ స్థాయి కాంపౌండ్ వాల్ కూలిపడింది. ఈ ఘటనలో ఇళ్లలోని వారు అర్థరాత్రి నిద్రలోనే దాదాపు 17 మంది వరకూ చనిపొయ్యారు.

వర్షాకాలంలో గుడిసెలలోని వారు, ఈ విధంగా గోడల కూలి కాళ్లు చేతులు విరిగిన వారు, మృతి చెందిన వారు ఎందరో ఉన్నారని ఓ హక్కుల నేత వాపొయ్యారు. కొండల మీద పలు గుడిసెలు, కచ్చా ఇళ్లు వెలిశాయని, వీరి బతుకులకు భద్రత లేదని 29 ఏండ్లలో దాదాపు 290 మంది వరకూ శివార్లలోని ఇటువంటి ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలడం వంటి ఘటనలతో దుర్మరణం చెందారని వెల్లడైంది.

విక్రోలి శివార్లలో మట్టిచరియలు విరిగిపడ్డ ఘటనలో అర్థరాత్రి వేళలోనే దాదాపు ఏడుగురు గుడిసెవాసులు తనువు చాలించారు. ముంబైలో కేవలం మూడు గంటల వ్యవధిలో అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్యలో 250 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనితో ఆదివారం ఉదయానికి మొత్తం మీద నమోదు అయిన వర్షపాతం 305 మిమీలు అయింది. ముంబైలో వర్షాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ వెలువరించింది.

ముంబై ఉపరితలాన్ని ఆవరించుకుని దాదాపు 18 కిలోమీటర్లు ఎత్తుతో మబ్బులు ఆవరించుకుని ఉన్నాయి. దీనితో భారీ వర్షాలకు అవకాశం ఏర్పడిందని వాతావరణ విభాగం తేల్చిచెప్పింది. ఈ దట్టమైన మబ్బు శిఖరమే దాదాపు మౌంట్ ఎవరెస్టు అంతటి ఎత్తులో ఉందని ఐఎండి నిపుణులు అక్షయ్ దేవ్‌రాస్ తెలిపారు.