తెలంగాణలో యథేచ్ఛగా కరోనా నిబంధనల ఉల్లంఘన

తెలంగాణలో యధేచ్చగా కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. మాస్క్‌లు ధరించాలన్న ముందుజాగ్రత్త పట్టడం లేదు.. భౌతిక దూరం పాటించాలన్న నిబంధన గుర్తే రావడం లేదు..! మొత్తమ్మీద కరోనా భయం అటు ప్రభుత్వంలో గాని, ఇటు ప్రజలలో గాని కనబడటం లేదు.  

దీంతో అందరు భయపడుతున్న కరోనా మూడో వేవ్ తెలంగాణాలో ముందుగానే ప్రవేశిస్తుందా అనే భయం ఆరోగ్య నిపుణులతో వ్యక్తం అవుతున్నది. ప్రజా జీవనం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తే అసలు మహమ్మారి లేదన్నట్లుగా వ్యరిస్తున్నది. 

ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నాటికి థర్డ్‌ వేవ్‌ వస్తుందని వైద్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంటే.. వైద్య నిపుణులు మాత్రం పరిస్థితులు ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లోనే థర్డ్‌వేవ్‌ ఖాయమని హెచ్చరిస్తున్నారు.

దీనికి తగ్గట్టే రాష్ట్రంలో రెండు ఆదివారాల నుంచి జరుగుతున్న బోనాల్లో ప్రజలు గుమిగూడుతున్నారు. భక్తుల్లో 80 శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదు. వారాంత సంతలు, ఆదివారాలు చేపలు, మాంసం మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు భారీగా హాజరవుతున్నారు. పర్యాటక ప్రాంతాలకు పెద్దఎత్తున వెళ్తున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు నిలకడగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ ఇన్‌పేషెంట్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూపై చేరేవారి సంఖ్య అధికమవుతోంది. 

ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారమే ఆస్పత్రుల్లో శనివారం ఆక్సిజన్‌పై 1,728 మంది రోగులుండగా, ఆదివారం సాయంత్రానికి సంఖ్య 1,746కు పెరిగింది. ఐసీయూ పై ఉన్నవారి సంఖ్య 1,324 నుంచి 1,328కి చేరింది. హైదరాబాద్‌లోని అధిక శాతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 15-20 మంది చికిత్స పొందుతున్నారు. ఒకటీ, రెండు ఆస్పత్రుల్లో 40-80 మంది ఉన్నారు.

ఇప్పుడే ఇలా ఉంటేవ వరుసగా పండుగలు రాబోతున్న నేపథ్యంలో పరిస్థితిని ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతోంది. కాగా, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ నియంత్రణలోకి రాలేదు.  రాష్ట్రంలో 11 ప్రాంతాలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. 

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లారు. సంహపక్తి భోజనాలు చేశారు. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. ఎక్కువ శాతం మంది మాస్కులు ధరించలేదు.  ఇక చాలామంది మంత్రులు మాస్క్‌లు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలు ఒకేచోట పోగయ్యారు.

కాగా, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు హైదరాబాద్‌లో పెద్దఎత్తున సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. త్వరలో ఉపఎన్నిక జరుగనున్న హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు పెరుగుతూ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తున్నది.  కరీంనగర్‌ జిల్లాల్లో నమోదయ్యే  కేసుల్లో 30 శాతం హుజూరాబాద్‌ నుంచే వస్తున్నాయి.