ఏపీ జలదోపిడీకి ఇక అడ్డుకట్ట

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ)ల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట పడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్‌, దక్షిణ తెలంగాణ నోట్లో మట్టికొట్టారని ఆమె  మండిపడ్డారు.
 
 విభజన చట్టం ప్రకారమే కేంద్రం రివర్‌ బోర్డుల పరిధిని నోటిఫై చేసిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు మరచిపోవద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. 
 
కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్‌తో మనవాటా నీటిని పక్కాగా వాడుకోవచ్చని బీజేపీ నేత ఏపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు రాకముందే ఎలా నోటిఫై చేస్తారని టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 ట్రిబ్యునల్‌కు, బోర్డుల పరిధికి సంబంధం లేదని, ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను పక్కాగా అమలు చేయడమే బోర్డుల బాధ్యత అనే విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు సోయి మరచి మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. 
 
కాగా, అలంపూర్‌ జోగులాంబ దేవాలయాన్ని సాంస్కృతిక, వారసత్వ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. జూరాల ప్రాజెక్టునూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆమె కోరారు.