సెప్టెంబర్‌ 10 నుంచి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవాలు

సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి  భగవంత్‌రావు స్పష్టం చేశారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 
 
ఉత్సవాలు సెప్టెంబర్‌ 10న ప్రారంభమై.. 19న ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. గణేశ్‌ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు బాగు చేయడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 
 
గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ముడిసరుకును సమయానికి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.గణేశ్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని ఆయన తెలిపారు. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని భగవంత్‌రావు కోరారు.
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల మేరకు అన్ని మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మండపాలు, దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాలని, డిస్కో పాటలు వద్దొన్నారు. ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.
 
ఖైరతాబాద్ గణపతి నమూనా 
 
భాగ్యనగర్ గణపతి నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ విగ్నేశ్వరుడికి ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడి రూపానికి సంబంధించిన డిజైన్‌ను ఉత్సవ్‌ కమిటీ ఆవిష్కరించింది.
ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య దర్శనమివ్వబోతున్నాడని తెలిపారు. ఈ విగ్రహం ఎత్తు 40 అడుగులు ఉండబోతోంది. విగ్రహానికి ముందు నందీశ్వరుడు, గరుఖ్మంతుడు ప్రార్థిస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు. వారికి వెనుక ఒకవైపు సింహం, మరో వైపు గుర్రం ఉంటాయి.
ఇక మహా గణపతి మంటపానికి ఒక వైపు కాళీ మాత రూపంలోని కృష్ణుడిని ఆరాధిస్తున్న రాధ, మరోవైపు నాగదేవత విగ్రహాలను కొలువుదీరుస్తారు. ఈ థీమ్‌లో ప్రత్యేకంగా గణపయ్య రూపాన్ని డిజైన్ చేసిన ఎస్. అన్బరాసన్ అని, విగ్రహం చేయబోయే శిల్పి సి.రాజేంద్రన్ అని ఉత్సవ కమిటీ తెలిపింది.