కృష్ణా జలాలపై కేసీఆర్ వైఖరేంటి?

కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారు కేవలం కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటూ  గోదావరి, కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్‌ ఏమాత్రం ప్రయత్నించడంలేదని ఆరోపించారు. 
 
 త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. 2015 ఒప్పందం ప్రకారం తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 
 
అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారు అని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కోసమేద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. 
 
సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదం నడుస్తుండగా, ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం, 8 నెలల తర్వాత వెనక్కి తీసుకోవడంలో మతలబేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే జగన్ దోచుకుపోతున్నాడని మండిపడ్డారు.

‘తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్. కమీషన్ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యాడు. బహిరంగంగా ఎవరి వాటా ఎంతనేది మేం బహిరంగంగా చెబుతున్నా సీఎం స్పందించడం లేదు. రెండు రాష్ట్రాల సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌కు పాల్గొనేందుకు సమయం లేదంట? అందుకే వాయిదా వేయించాడు. పునర్విభజన హామీలు ఉల్లంఘించి రెండు రాష్ట్రాల సీఎంలు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీజేపీ తప్పకుండా అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. దళితులంతా ఏకమై సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని బీజేపీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య పిలుపిచ్చారు.

కాగా, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ కలిసి ఆడుతున్న నాటకమే తాజా జల వివాదాలని సీనియర్‌ నేత మురళీధర్‌రావు భువనగిరిలో విమర్శించారు. కేంద్రం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌.. నీటి రాజకీయాలకు ముగింపు పలుకుతుందని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు  ఎన్‌.ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు.