రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్‌ జెండాలు

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన  చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీకి కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. 
 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్వంలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇందిరా పార్కు వద్ద ధర్నా కోసం అనుమతికి తాము దరఖాస్తు చేయగా,   పోలీసులు  గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు  మండిపడ్డారు.
మరోవైపు పోలీసులను నుంచి తప్పించుకుని వచ్చిన కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజ్‌భవన్‌ గేటుకు కాంగ్రెస్‌ జెండాలు కట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. భద్రతా వైఫల్యంపై సమీక్ష నిర్వహించారు. అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ జెండాలు పెట్టిన ఇద్దరిపైనా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, రాజ్‌భవన్ గేట్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హుటాహుటిన సీసీ కెమెరాలు మరమ్మతు చేపట్టినట్టు సమాచారం.

ఇందిరాపార్క్‌ దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజ్‌భవన్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రేవంత్ రెడ్డి బారికేడ్లు దాటి బయటికి వెళ్లారు. దీంతో రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.