అనిల్‌ దేశ్‌ ముఖ్‌ నివాసంపై ఇడి దాడులు

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ నివాసంపై  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాడులు జరిపింది. రూ.100 కోట్ల మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం ఉదయం నాగ్‌పూర్‌ జిల్లాలోని వాద్విహిరా, కటోల్‌లోని నివాసంపై దాడులు నిర్వహించింది.
 
ఆదివారం ఉదయం ఏడుగంటల సమయంలో సిడిఆర్‌ఎఫ్‌ బృందంతో పాటు ఇడి ఈ సోదాలు ప్రారంభించింది. ఆ సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌, కుటుంబ సభ్యులు అక్కడలేరు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఇడి ఈ దాడులు చేస్తోంది. 
 
బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్ల వసూళ్లు చేయాలంటూ మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌వాజేతో పాటు పలువరు అధికారులను దేశ్‌ ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సిబిఐని ఆదేశించింది. 
 
కాగా, సిబిఐ నమోదు చేసిన కేసు విచారణకు హాజరు కావాలంటూ ఇడి పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ  దేశ్‌ముఖ్‌ స్పందించలేదు. దీంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద రెండు రోజుల క్రితం అనిల్‌దేశ్‌ముఖ్‌కు చెందిన రూ.4.20 కోట్ల ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకుంది.