మరో 66 కోట్ల టీకాలు కేంద్రం ఆర్డర్

మరో 66 కోట్ల టీకాలు కేంద్రం ఆర్డర్
ఈ ఏడాది చివరి నాటికి వయోజనులందరికీ వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియలో భాగంగా కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో 66 కోట్ల కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ మోతాదుల కోసం ఆర్డర్‌ పెట్టింది. అదేవిధంగా ధరల్లో కూడా మార్పులు చేసింది. ఆగస్టు నుండి డిసెంబర్‌ మధ్య అందించాలని పేర్కొంది.
 
37.5 కోట్ల మోతాదులు కోవిషీల్డ్‌ టీకాలు,  28.5 కోట్లు కోవాగ్జిన్‌ టీకాలను ఆర్డర్‌ చేసింది. జూన్‌ 21 నుండి అమల్లోకి వచ్చిన సవరించిన ధరల ప్రకారం కోవిషీల్డ్‌ ఒక్క డోసుకు రూ. 205, కోవాగ్జిన్‌ ఒక్క డోసుకు రూ. 215ను చెల్లించనుంది. గతంలో ఈ రెండింటికీ రూ. 150 చెల్లించేది. పన్నులు కూడా కలిపితే వీటి ధరలు వరుసగా రూ. 215.25, రూ.225.75 చెల్లించనుంది. 
 
ఈ కొత్త విధానంలో మొత్తం టీకా ఉత్పత్తిలో 75 శాతం డోసుల్ని కేంద్రం తయారీదారుల నుండి సేకరిస్తోంది. ఆ తర్వాత స్టాక్‌ను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్నాయి.
 
ఇలా ఉండగా,  కరోనా పాజిటివ్‌గా తేలిన వారందరూ తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే టీబీ వ్యాధిగ్రస్థులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. 
 
అయితే..కరోనా కారణంగానే టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పేందుకు ఆధారాలేవీ లేవని కూడా కేంద్రం స్పష్టం చేసింది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు అవకాశం కోసం ఎదురుచూస్తూ బలహీనంగా ఉన్నవారిపై దాడి చేస్తాయని, కాబట్టి కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యునిటీ బలోపేతమయ్యేందుకు కోసం కృషి చేయాలని కూడా సూచించింది.