రూ.163 కోట్ల డ్రగ్స్‌ను తగులబెట్టిన అస్సాం సీఎం

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్‌ డీలర్స్‌పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను శని, ఆదివారాల్లో డిఫు, గోలఘాట్, బర్హంపూర్, హజోయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ధ్వంసం చేశారు. 

ఈ ఏడాది మే 10 నుంచి జూలై 15 మధ్యకాలంలో రాష్ట్ర పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం ప్రకారం 874 కేసులను నమోదు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,493 మంది మాదకద్రవ్యాల డీలర్లను అరెస్టు చేసి, దాదాపు రూ. 163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని ముఖ్యమంత్రి శర్మ తెలిపారు. 

అక్రమ డ్రగ్స్‌ వ్యాపారం ఒక అంటువ్యాధి అని, ఇందులో పాల్గొన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆదివారం బర్హంపూర్‌లో జరిగిన డ్రగ్స్‌ ధ్వంసం కార్యక్రమంలో ఆయన హెచ్చరించారు. నాగాన్‌లో నిర్వహించిన డ్రగ్స్ డిస్పోజల్ కార్యక్రమంలో సీఎం శర్మ స్వయంగా బుల్డోజర్‌ నడిపి డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు.

ఇలా ఉండగా, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. స్పేయిన్‌ నుంచి వచ్చిన ఓ పార్సిల్‌లో దాదాపు రూ 56 లక్షల విలువైన మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. అట్టాపెట్టెతో చేసిన బాక్స్‌లో ఓ గ్రీటింగ్‌ కార్డు, రెండుప్లాస్టిక్‌ కవర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు వాటిని తనిఖీ చేశారు. 
 
వీటిలో 994 పింక్‌ పనిషర్‌ ఎండీఎంఏ, 249 ఎల్ఎస్‌డీ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్‌పై ఉన్న చిరునామాను పరిశీలించిన చైన్నై, కడలూరు కస్టమ్స్‌ అధికారులు పుదుచ్చేరిలోని అరొవిల్లే ప్రాంతానికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరి ఇళ్ల నుంచి 2.5 లక్షల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో గుర్తించామని అధికారులు తెలిపారు.