వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న పది ‘వందే భారత్‌’ రైళ్లు

వచ్చే ఏడాది పది కొత్త ‘వందే భారత్‌’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. భారతీయ రైల్వే ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం  సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా 2022 ఆగస్ట్‌ నాటికి పది ‘వందే భారత్‌’ రైళ్లను 40 నగరాలకు అనుసంధానం చేయాలని రైల్వే శాఖ యోచిస్తున్నది. 

దేశీయ సెమీ హై స్పీడ్‌ ట్రైన్‌ ‘వందే భారత్‌’ ప్రాజెక్టుపైనే కొత్త రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఈ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ నాటికి దేశంలోని 40 నగరాలకు వందే భారత్‌ రైళ్లు నడిచేలా ప్రణాళికను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాగా, 44 వందే భారత్‌ రైళ్లకు విద్యుత్‌ వ్యవస్థలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన మేధా సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో పొందింది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తి వేగాన్ని పెంచాలని ఆ సంస్థకు రైల్వే మంత్రి సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండు నమూనా రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇంజిన్‌ లేకుండా నడిచే ఈ రైళ్లలో విమానాల్లో మాదిరిగా సీట్లు, ఆటోమేటిక్‌ డోర్లు, ఆధునాతన సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతం దేశంలో రెండు ‘వందే భారత్‌’ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ 2019లో ప్రారంభించారు. మరో రైలు ఢిల్లీ-కత్రా మధ్య నడుస్తున్నది.