ఆదానీ గ్రూప్‌ కంపెనీలపై సెబీ, డిఆర్‌ఐ దర్యాప్తు

ఆదానీ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ), డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) దర్యాప్తు చేస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. 

నిబంధనలకు అనుగుణంగా ఆదానీ గ్రూప్‌ కంపెనీలు పని చేస్తున్నాయా.. లేదా అన్న అంశాన్ని సెబీ, డిఆర్‌ఐ పరిశీలిస్తున్నాయని వెల్లడిస్తూ ఎవ్వరు చట్టానికి అతీతులు కారనే సంకేతం ఇచ్చారు. సోమవారం పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి పంకజ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

మారిషాస్‌ కేంద్రంగా ఒకే చిరునామాతో పని చేస్తోన్న ఆరు హవాలా కంపెనీలు అదానీ గ్రూపులోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయని గత నెలలో కధనాలు రావడంతో ఈ దర్యాప్తులు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.

ఈ అరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దర్యాప్తు చేయడం లేదని పంకజ్‌ తెలిపారు. ”దేశంలోని స్టాక్‌ ఎక్స్చేంజిల్లో ఆదానీ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలు లిస్టెడ్‌ అయి ఉన్నాయి. రోజువారీ ట్రేడింగ్‌ను బట్టి ఆయా సంస్థల్లో విదేశీ పోర్ట్‌ ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పిఐ) కలిగి ఉన్నాయి” అని తెలిపారు. 

అబ్దుల్లా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఎపిఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థల నుంచి ఆదానీ గ్రూప్‌ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులను జూన్‌ 16న సెబీ స్తంభింపచేసిందని మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. 

సెబీ, ఎన్‌ఎస్‌డిఎల్‌ ఆంక్షలతో గత నెలలో ఆదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు భారీగా పతనం కావడంతో గౌతం అదానీ నికర సంపద వేల కోట్లు కరిగిపోయింది. ఈ ప్రభావంతో చిన్న మదుపర్లు కూడా తమ విలువను నష్టపోవడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు.