భార‌త్ సార్వ‌భౌమాధికారాన్ని ప్ర‌శ్నిస్తే దీటుగా బ‌దులిస్తాం

 
పారామిల‌ట‌రీ బ‌లగాలు ఎన్నోస‌వాళ్లు ఎదుర్కొంటూ అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నాయ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌శంసించారు.శ‌నివారం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త జాతీయ భ‌ద్ర‌త‌ని ఎన్నో స‌వాళ్ల న‌డుమ జ‌వాన్ల సేవ‌లు అసామాన్య‌మైన‌వ‌ని కొనియాడారు.
 
 మ‌న పారామిల‌ట‌రీ బ‌ల‌గాల ప‌ట్ల తాను పూర్తి విశ్వాసంతో ఉన్నాన‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో మ‌న‌కు స్వ‌తంత్ర రక్ష‌ణ విధానం ఉంద‌ని మ‌న సార్వ‌భౌమ‌త్వాన్ని స‌వాల్ చేసే శ‌క్తుల‌కు అదే భాష‌లో దీటుగా బ‌దులిస్తామ‌ని అమిత్ షా పేర్కొన్నారు.
 
ప్ర‌పంచ ప‌టంలో భార‌త్ త‌న స్ధానాన్ని ప‌టిష్టం చేసుకుంటోంద‌ని ధీమా వ్యక్తం చేస్తూ అస‌మాన త్యాగం చేసిన సైనికుల‌కు తాను సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుల‌ను దేశం మ‌రిచిపోద‌ని తెలిపారు. మ‌న స‌రిహ‌ద్దుల‌ను కాపాడుతున్న పారామిల‌ట‌రీ బ‌లగాలు, బీఎస్ఎఫ్ ద‌ళాల‌తో ప్ర‌పంచ ప‌టంలో మ‌న‌కు స‌ముచిత స్ధానం ద‌క్కింద‌ని కొనియాడారు.
 
డీఆర్డీవోతో పాటు మరికొన్ని సంస్థలు కలిసి తర్వలోనే స్వదేశీ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని తయారు చేస్తున్నాయని అమిత్‌షా ప్రకటించారు. ఈ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సరిహద్దుల వెంబడి మిగిలిపోయిన ఫెన్సింగ్ పని 2022 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
 
 ‘‘డ్రోన్ల భద్రతా సమస్య తీవ్రమైన సమస్యగా రూపాంతరం చెందింది. దీనిని అధిగమించడానికి డీఆర్డీవో, ఇతర సంస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో ఓ టెక్నాలజీని తయారు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తోంది’’ అని షా ప్రకటించారు. 
 
సంపూర్ణ భద్రతను కల్పించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది కల్లా దేశ సరిహద్దుల కంచెల్లోని అన్ని ఖాళీలను పూరిస్తామని అమిత్ షా ప్రకటించారు. సరిహద్దుల కంచెలలో ఖాళీలు ఉండాలని ఎవరూ కోరుకోరని, అయితే 200 కిలోమీటర్ల పొడవైన కంచెలో 1.5 కిలోమీటర్ల ఖాళీని విడిచిపెడితే ఆ మొత్తం కంచె నిర్మాణమే వృథా ప్రయాస అవుతుందని స్పష్టం చేశారు. 
 
సరిహద్దుల కంచెల మధ్య ఏర్పడిన ఖాళీలను పూరించడంపై పరిపాలనా స్థాయిలో అడ్డంకులను తొలగించడంతోపాటు పొరుగుదేశాలతో కూడా మాట్లాడామని ఆయన చెప్పారు. అన్ని అవరోధాలు తొలగిపోవడంతో 2022 కల్లా కంచెలలో ఏర్పడిన అన్ని ఖాళీలను పూరిస్తామని ఆయన తెలిపారు.
 
 కృత్రిమ మేధస్సుతో భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, కృత్రిమ మేధస్సు వారికి ఓ ఆయుధంగా మారిందన్నారు. శాంతి అత్యావశ్యకమని, అయితే శత్రువు అర్థం చేసుకునే భాషలోనే దీటైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాంటి విధానాన్నే రూపొందించామని పేర్కొన్నారు. 
 
కొత్త కొత్త అధునాతన సాంకేతిక పద్ధతులతో దేశ భద్రత విషయంలో దృష్టి నిలుపుతున్నామని షా పేర్కొన్నారు. అయితే బీఎస్‌ఎఫ్‌కు సంబంధించిన కుటుంబాల యోగ క్షేమాలు తాము చూసుకుంటామని, సందేహం అవసరం లేదని అమిత్‌షా జవాన్లకు భరోసా ఇచ్చారు. ‘‘మీ కుటుంబాల యోగక్షేమాలు మేం చూసుకుంటాం. వసతి, ఆరోగ్యం, భద్రతా అన్నీ మేం చూసుకుంటాం. దేశ భద్రతా విషయాలు మీరు చూసుకోండి’’ అని అమిత్‌షా కోరారు.