ప్ర‌ధాని మోదీతో శ‌ర‌ద్ ప‌వార్ భేటీ

ఎన్సీపీ నేత, ఎంపీ శ‌ర‌ద్ ప‌వార్ ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశారు. ప్ర‌ధాని నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు వారిద్ద‌రి మ‌ధ్య‌ భేటీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌ర‌ద్ ప‌వార్‌, మోదీ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. 
 
వ‌ర్షాకాల స‌మావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రి భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. మరోవైపు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూశ్ గోయల్ కూడా పవార్‌తో శుక్రవారం సంప్రదింపులు జరిపారు.పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 
గాంధీ కుటుంబంతో వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ భేటీ అయిన నేప‌థ్యంలో శ‌ర‌ద్ ఎపిసోడ్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. కానీ తాను రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో నిల‌వ‌డంలేద‌ని ప‌వార్ స్పష్టం చేశారు. శ‌ర‌ద్ ప‌వార్ వ‌య‌సు 80 ఏళ్లు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌తిప‌క్ష పార్టీల‌ వైపున నిల‌బ‌డ్డారు. కానీ 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల గురించి ఇప్పుడే చెప్ప‌లేమ‌ని పేర్కొన్నారు. రాజ‌కీయ ప‌రిస్థితులు ఎప్పుడూ మారుతుంటాయ‌ని ఆయ‌న ఇటీవ‌ల తెలిపారు.
 
గతంలో కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ కూడా మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తర్వాత మహా వికాస్ అగాఢీలో కాస్త కుదుపు ప్రారంభమైంది. ఆ తర్వాత మోదీ భేటీపై ఓ వివరణ కూడా ఇచ్చింది. తాజాగా మహావికాస్ అగాఢీలో భాగమైన ఎన్సీపీ అధినేత పవార్ కూడా మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాలు ఎలా వుంటాయో చూడాలి మరి. 
 
 కాగా, ఎన్‌సీపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖపైనా, రైతుల సమస్యలపైనా శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. సహకార బ్యాంకుల రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు. 
ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రస్తావించారు.