టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరడం తప్పినట్లే

ఆస్పత్రిలో రాల్సిన పరిస్థితిని, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరును చూపాయని భారత వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వారిపై ఐసిఎంఆర్ ఓ అధ్యయనం నిర్వహించింది. 

కొవిడ్ రెండో దశ ఉధృతి సమయంలో (ఈ ఏడాది ఏప్రిల్‌జూన్ మధ్య కాలంలో) నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొట్ట మొదటిది. అంతేకాదు అతి పెద్దది కూడా. ఈ పరిశోధన సందర్భంగా ఆ సంస్థ అనేక విషయాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం 677 మంది కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా 80 శాతం మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారని తెలిపింది. 

ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసుల టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసిఎంఆర్ ఈ అధ్యయనం నిర్వహించింది. వారినుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది. వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ( బి.1.617.2)ను గుర్తించింది.

ఆ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. 0.4 శాతం మరణాలు సంభవించాయి. దీనిని బట్టి టీకా తీసుకోవడం వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.

ఇక వీరిలో 482 మందికి (71 శాతం) లక్షణాలు కనిపించగా, మిగతా 29 శాతం మందికి లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్న వారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాసతీసుకోలేక పోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారినుంచి శాంపిల్స్ సేకరించగా, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 592 మంది ఉండగా, ఒక డోసు తీసుకున్న వారు 85 మంది ఉన్నారని ఆ అధ్యయనం పేర్కొంది.

రానున్న వంద రోజులు కీలకం 

కాగా, దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న వంద రోజులు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచమంతా కరోనా థర్డ్‌ వేవ్‌ వైపు మల్లుతున్నదని, కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. 

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర  మోదీ తమకు చెప్పినట్లు నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పౌల్‌ తెలిపారు. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, సహజ హెర్డ్‌ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదని చెప్పారు. అందుకే నిరంతర వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.

కరోనా థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌ అన్నది ముఖ్యం కాదని వైరస్‌ వ్యాప్తి తీవ్రత ముఖ్యమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా పరిస్థితిని మనం ఎలా నిర్వహించగలుగుతున్నాం అన్న దానిపై వేవ్స్‌ ఆధారపడి ఉంటాయని చెప్పారు. 

ఆంక్షల సడలింపు నేపథ్యంలో మాస్కులను ధరించడంపట్ల ప్రజలు నిర్లక్షం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రేటు పది శాతానికిపైగా ఉన్నదని ఆయన వెల్లడించారు.