అక్రమ తల్లిదండ్రులేమో కానీ, అక్రమ సంతానం ఉండదు 

అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ, అక్రమ సంతానం ఉండదని స్పష్టం చేసింది. పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని వ్యాఖ్యానించింది. 

ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే బెంగళూరు ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థ బెస్కాంలో గ్రేడ్‌-2 లైన్‌మెన్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ రెండో భార్య కుమారుడు కె.సంతోష 2014లో సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. 

అయితే, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని, రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని బెస్కాం చెప్పింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌ కొట్టివేసింది. అనంతరం ఈ కేసు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. 

తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బివి నాగరత్న, హంచాటె సంజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి సంతోషకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా.. ‘తల్లి, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో ఏ బిడ్డ జన్మించదు. అదే విధంగా పుట్టుకలో తన ప్రమేయం కూడా ఉండదు. కాబట్టి అనైతికంగా తల్లిదండ్రులుగా మారిన వారు ఉంటారేమో గానీ, అక్రమ సంతానం అనేది ఉండదు. ఈ కేసుకు సంబంధించి, వ్యక్తిగత చట్టాలను అనుసరించి అక్రమ సంతానం అనే పదం లేదు.’ అని పేర్కొంది.