ఎల్‌ఎసి వెంబడి చైనా సైనిక శిబిరాలు

సరిహద్దులలో చైనా కవ్వింపులు సాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనా సైనిక బలగాల బస కోసం శాశ్వత నిర్మాణాలు కాంక్రీటు పద్ధతిలో చేపట్టారని నిఘా వర్గాలు పసికట్టాయి. ఇటువంటి నిర్మాణాలతో పాటు రహదారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసింది.  
దీనితో చైనా పేరుకే ఇక్కడ కాల్పుల విరమణకు దిగిందని, అయితే ఈ తెరవెనుక పూర్తిస్థాయిలో తన బలగాల పటిష్టతకు, అతి వేగంగా సైన్యం కదలికలకు అన్ని సన్నాహాలు చేసుకొంటోందని, కవ్వింపు చర్యలు తప్ప చైనా దూకుడు మారలేదని స్పష్టం చేసింది.

 సరిహద్దుల్లో చైనా మళ్లీ నిర్మాణాలు చేపట్టింది. బలగాల కోసం భవనాలు కడుతోంది. కాంక్రీట్​తో శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఉత్తర సిక్కింలోని నకు లా ఏరియాకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే చైనా ఈ శిబిరాన్ని కడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోనూ మన భూభాగానికి దగ్గర్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పాయి. 

సరిహద్దుల్లో గొడవలు జరిగినప్పుడు, తమ బలగాలను తొందరగా అక్కడికి పంపేందుకు చైనా ఈ పని చేస్తోందని పేర్కొన్నాయి. డ్రాగన్ కంట్రీ కొన్నేండ్లలో సరిహద్దు వెంట రోడ్లను కూడా నిర్మించిందని వివరించాయి. శాశ్వత శిబిరాల ఏర్పాటుతో చైనా బలం పెరుగుతుందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

చైనా కార్యక్రమాలపై మన దేశ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయని చెప్పాయి. సరిహద్దులో చలికాలంలో ఉండే వాతావరణ పరిస్థితులను చైనా బలగాలు తట్టుకోలేకపోతున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించి, తమ బలగాలను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికైనా తరలించేందుకు చైనా అన్ని సదుపాయాలతో ఈ శిబిరాలు నిర్మిస్తోంది. 

భారతదేశంతో ఉన్న వివాదాస్పద ప్రాంతాలకు నేరుగా తొందరగా చేరుకునేందుకు సిద్ధం అయినట్లు స్పష్టం అయింది. అన్నింటికి మించి చైనా ఆర్మీ సిక్కిం, లద్థాఖ్‌ల చెంతన మకాం వేసుకుందని , రోజురోజుకీ బలోపేతం అవుతోందనే నిఘా సంస్థల సమాచారం భద్రతా బలగాలకు ఆందోళన కల్గించింది.

పాక్ విమానాన్ని తరిమికొట్టిన భారత్ సేనలు 

మరోవంక,  సరిహద్దులలో ఎల్‌ఒసి వెంబడి గగనతలంలో సంచరిస్తున్న పాక్ తేలికపాటి విమానం (క్వాడ్‌క్యాప్టర్)పై భారతీయ సైన్యం కాల్పులు జరిపింది. భారతీయ ప్రాంతంలోకి చొరబడేందుకు ఈ విహంగం యత్నించింది. దీనిని గమనించి వెంటనే పల్లాన్‌వాకా సెక్టార్‌లోని జాగరూకతతో ఉన్న సైన్యం గుర్తించింది. 

వెంటనే కాల్పులు జరిపి, దీనిని నేలకూల్చేందుకు ప్రయత్నించారు. అయితే తప్పించుకుని ఈ విమానం పాకిస్థాన్ వైపు వెళ్లిందని వెల్లడైంది. ఈ ప్రాంతంలో భారతీయ సైన్యం కదలికలను పసికట్టేందుకు పాకిస్థాన్ సైనికబలగాలు గుట్టుచప్పుడు కాకుండా ఈ విమానాన్ని పంపించి ఉంటారని అనుమానిస్తున్నారు. 

ఇటీవలే జమ్మూ శివార్లలోని భారతీయ వాయుదళ స్థావరంపై పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు బాంబులు ఇతరత్రా పేలుడు పదార్థాలను జారవిడ్చాయి. తరువాత కూడా ఈ ప్రాంతంలో పలు డ్రోన్లు గగనతలంలో కన్పిస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి డ్రోన్ల స్థాయిని మించి తేలికపాటి విమానాన్ని పాకిస్థాన్ పంపించిందని వెల్లడైంది. ఇప్పటివరకూ డ్రోన్లను పంపించింది పాక్ కేంద్రీకృత ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు క్వాడ్‌క్యాప్టర్‌ను పాక్ సైన్యం తరలించిందని స్పష్టం అయింది.