తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం… రంగంలోకి కేంద్రం!

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం `జలదోపిడీ’కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేసుకొంటూ,  ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకొంటూ, సుప్రీం కోర్ట్ కు కూడా వెడుతున్న సమయంలో ఇప్పటి వరకు వారిద్దరికీ సర్దిచెప్పడం కోసం విఫల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. 

రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది.  కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసింది. ఈ నదుల యాజమాన్య బోర్డులను నోటీపై చేస్తూ కేంద్రం గురువారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తెస్తూ గెజిట్ విడుదల చేసింది. ప్రాజెక్టులపై పూర్తి పెత్తనం బోర్డులకే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారే బోర్డుల ఛైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లుగా ఉంటారని కేంద్రం తేల్చిచెప్పింది. అనుమతిలేని ప్రాజెక్టులకు 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాటిని నిలిపివేస్తారు. ఈ నోటిఫికేషన్ అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానుందని కేంద్రం వెల్లడించింది.

కృష్ణా జలాలపై కట్టిన ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలపై సంపూర్ణ అధికారం కోరుకుంటూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) తుది ముసాయిదాను ఇదివరకే  తెలుగు రాష్ట్రాలకు పంపించి, అభిప్రాయాలు కూడా తీసుకుంది. తెలంగాణ ఈ ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకించింది. 

ఆర్నెలలుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత 

అయితే, ముదురుతున్న జల వివాదాల నేపథ్యంలో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌పై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. నోటిఫికేషన్‌తో కృష్ణా ప్రాజెక్టులు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) పర్యవేక్షణలోకి, గోదావరి ప్రాజెక్టులు గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీడీఆర్‌ఎంబీ)పర్యవేక్షణలోకి వస్తాయి. ప్రాజెక్టుల కార్యకలాపాలు, నిర్వహణ, నియమ నిబంధనలను ఈ గెజిట్‌లో పొందుపరుస్తారు. 

ఆర్నెల్లుగా కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) కుడి కాలువ నిర్మాణ పనులను ఏపీ సర్కారు సరైన అనుమతులు లేకుండా చేపడుతోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని ఎన్జీటీలో కేసు వేసింది. కేంద్రం ఇరు నదులపై ప్రాజెక్టులను రెండు నదీ బోర్డులకు అప్పగిస్తూ, ప్రాజెక్టులపై సంపూర్ణ అధికారాలను వాటికి దఖలు పరుస్తూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తోంది.

కృష్ణానది జలాల వినియోగానికి సంబంధించి తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న పనులు వెంటనే ఆపాలని కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు గురువారం వేర్వేరుగా రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. కృష్ణానదికి ప్రధాన ఉపగా ఉన్న తుంగభద్ర నదిపైన ఆర్డీఎస్ వద్ద ఎపి ప్రభుత్వం చేపట్టిన కుడి కాలువ నిర్మాణ పనులు వెంటనే నిలిపి వేయాలని బోర్డు సభ్య హరికేష్ మీనా ఎపి ఈఎన్సీకి లేఖరాశారు.

ప్రాజెక్టుకు సంబంధించిన డిపి ఆర్ సమర్పించి ఆమోదం పొందకుండా పనులు చేపట్టవద్దని లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం జల కేంద్రం నుంచి నిటి విడుదలను నిలిపివేయాలని తెలిపింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టవద్దని తెలంగాణ రాష్ట్ర జెన్‌కో డైరెక్టర్‌కు రాసిన లేఖలో కృష్ణా సభ్యులు మౌతాంగ్ స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ ల వద్ద కేంద్ర దళాల భద్రత 

ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ అధికారం బోర్డులకు అప్పగిస్తుండటంతో ప్రాజెక్టుల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్ఎఫ్) కాపలా కాయనున్నాయి. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు కాపలాగా ఉంటున్నారు. ఇక ముందు రాష్ట్ర పోలీసులకు ప్రవేశం కూడా ఉండదు. 

ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం, దించడం, వరద నీటి ప్రవాహ పరిస్థితులు గమనించడం, ఏ సమయంలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి? ఏ సమయంలో నిలుపుదల చేయాలి? వంటి నిర్ణయాలన్నీ బోర్డు అధికారులే తీసుకుంటారు. బోర్డులలో రెండు రాష్ట్రాల అధికారులు/సిబ్బంది ఉంటారు.

బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయం అంతా రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలోగా నిధులు విడుదల చేయకపోతే సంబంధిత రాష్ట్రానికి జరిమానా విధించే అధికారం కూడా బోర్డులకు రానుంది.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించి,  సీఐఎస్ఎఎఫ్ కు భద్రత అప్పజెప్పాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుండగా, తెలంగాణ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా జలాల కేటాయింపు వివాదం తేలకుండా బోర్డులకు ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తారని రాష్ట్రం ప్రశ్నిస్తోంది.

 బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే ఉందని, జలాల కేటాయింపు ఫైనల్‌ కాకుండా ఏ విధంగా అప్పగిస్తారనేది తెలంగాణ వాదన. జలాల కేటాయింపు తేలకుండా, నీటి విడుదలపై కేఆర్‌ఎంబీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ వాదిస్తోంది.