తెలంగాణలో బిజెపి జెండా ఎగరాలని కోరిన అమిత్ షా 

“తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తా. బిజెపి  బలోపేతానికి కలసికట్టుగా కృషి చేద్దాం” అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అభిలాష వ్యక్తం చేశారు. గత నెల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో తొలిసారి అమిత్ షా ను కలసినప్పుడు ఆయన రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. 

ఈటెలతో పాటు పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వివేక్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి   ఢిల్లీలో ఆయనను కలిశారు. హుజురాబాద్ ఉపఎన్నికలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై చర్చించారు. ఉమ్మడి సమావేశం అనంతరం సంజయ్‌ వినతి మేరకు ఈటల రాజేందర్‌తో అమిత్‌ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంజయ్‌తోనూ షా ప్రత్యేకంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బాగా పోరాడుతున్నారని, ఇలాగే ముందుకెళ్లాలని సంయజ్‌కు సూచించినట్లు సమాచారం.

ఈటల రాజేందర్‌కు మంచి పేరుందని, ఆయన ముందు టీఆర్‌ఎస్‌ డబ్బులు పనిచేయవని షా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అధికార పక్షం ఎంత డబ్బు ఖర్చు చేసినా హుజారాబాద్ ఉపఎన్నికలలో గెలిచేది బీజేపీ మాత్రమే’ అని ఈటల రాజేందర్‌ ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పగా.. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ తెలంగాణకు వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. 

 ప్రేమ, ఆప్యాయతలతో ఈటలను దగ్గరకు తీసుకున్న అమిత్‌ షా.. హుజూరాబాద్‌లో తప్పకుండా గెలవబోతున్నారని, ఈ మేరకు తమకు నివేదికలు అందాయని తెలిపారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా కొట్లాడాలని సూచించారని సంజయ్ చెప్పారు.

 ‘‘ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి కలిశాము” అని భేటీ అనంతరం బండి సంజయ్ తెలిపారు.  ఎన్నికల ప్రచారానికి రావాలని అమిత్‌ షాను కోరామని, అందుకు అంగీకరించారని పేర్కొన్నారు. తాను చేపట్టబోయే పాదయాత్రకు రావాలని ఆహ్వానించామని, అందుకు అంగీకరించిన షా.. ఎన్ని సార్లయినా రాష్ట్రానికి వస్తానన్నారని చెప్పారు.

గ్రామాల్లో సమస్యలు తెలుసుకోడానికి పాదయాత్ర చేస్తున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.  ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌ఎస్‌ భయపడుతోందని, ఆ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని, కార్యకర్తలు కరువయ్యారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ డబ్బులు ఇచ్చి కొన్నా కూడా.. డబ్బులు తీసుకున్న వారు ఈటల రాజేందర్‌కు ఫోన్‌ చేసి అండగా ఉంటామని అంటున్నారని చెప్పారు.

బీజేపీని వీడి ఇతర పార్టీలో చేరుతున్న నేతలపై స్పందిస్తూ.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లే వారు కొంత మంది ఉంటారని, అలాంటి వారి గురించి తాము ఎప్పుడూ ఆలోచించబోమని స్పష్టం చేస్తున్నారు. బీజేపీలో చేరినవారంతా కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ పార్టీ ఏదన్నది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమే. టీఆరెస్ పార్టీ భయపడుతోంది. వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదు. డబ్బులు ఎంత పంచినా.. అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపిద్దాం” అని సంజయ్ పిలుపిచ్చారు. అవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసం తాను పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.