క్రైస్తవ ప్రచారకుడు సోనీవుడ్ ను ఎపిపిఎస్సి నుండి తొలగించండి

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) సభ్యుడిగా నియమించిన క్రైస్తవ మత ప్రచారకుడైన సోనీ వుడ్ నూతలపాటిని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని గవర్నర్ బిశ్వభుషన్ హారిచందన్ కు మాజీ మంత్రి, టిడిపి ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు లేఖ రాశారు.

ఎపిపిఎస్‌సి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అటువంటి గౌరవప్రదమైన సంస్థకు మిస్టర్ సోనీ వుడ్ నూతలాపతి వంటి వారిని సభ్యునిగా నియమించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.  సోనీ వుడ్ సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తూ, ప్రస్తుతం జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) విచారణను ఎదుర్కొంటున్నాడని తెలిపారు.

సోనీ వుడ్ నూతలపాటి తన సంస్థయైన నజరేత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్‌నెస్ (నాసా) లో మైనర్ పిల్లలను నాశనం చేస్తున్నాడని ఎన్‌సిపిఆర్‌సి విచారణకు ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. ఎపిపిఎస్‌సి ఒక రాజ్యాంగ సంస్థ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అర్హతగల వారందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉందని గుర్తు చేశారు. 

అటువంటి గౌరవ ప్రదమైన సంస్థ సభ్యులుగా మచ్చలేని వ్యక్తులు ఉండాలి. లేనిపక్షంలో సంస్ధ అపఖ్యాతి పాలై ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు ఆకాంక్షించే యువత భవిష్యత్తు నాశనం అవుతుందని సూర్యారావు హెచ్చరించారు. అంతేకాక, ఇటువంటి పక్షపాత దోరణి గల వ్యక్తులు సభ్యులుగా ఉండటం వల్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండకపోగా విభిన్న విశ్వాసాలు, అభిప్రాయాల గల వ్యక్తులను ఉద్యోగాలకు ఎన్నుకోకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 

సోనీ వుడ్ నూతలపాటి క్రైస్తవ సువార్త ఆధారంగా విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని మాట్లాడాడని తెలిపారు. అంతేకాకుండా, మెడిసిన్, ఎడ్యుకేషన్ లను క్రైస్తవ మిషనరీలు తీసుకు వచ్చాయని మాట్లాడి భారతీయ స్వాతంత్య్రం కోసం, అణగారిన వర్గాల సాధికారతకు పునాదులు వేసిన మహనీయులను అవమానపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, మిస్టర్ సోనీ వుడ్ నూతలపాటి వ్యవహారంలో జోక్యం చేసుకుని విచారించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా సోనీ వుడ్ నూతలపాటిని ప్రతిష్టాత్మక ఎపిపిఎస్సి సభ్యునిగా తొలగించమని అభ్యర్ధించారు.