టోక్యో ఒలింపిక్స్‌‌ గోల్డ్ మెడల్ గెలిస్తే యుపి సర్కార్ రూ 6 కోట్లు

టోక్యో-2020 ఒలింపిక్స్‌‌లో పతకాలు సాధించే  ఉత్తర ప్రదేశ్  క్రీడాకారులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కనకవర్షం కురిపించనుంది. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకం సాధించేవారికి ఆరు కోట్ల రూపాయలు, వెండి పతకం సాధించేవారికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించేవారికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

అంతేకాదు టీం ఈవెంట్లలో గోల్డ్ మెడల్ నెగ్గేవారికి 3 కోట్లు, సిల్వర్ మెడల్ సాధించేవారికి రూ 2 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ఇంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రతి యూపీ క్రీడాకారుడికి పది లక్షల రూపాయల నజరానా ఇప్పటికే ప్రకటించారు. మెడల్స్ గెలిచినా, గెలవకున్నా ఈ నజరానా క్రీడాకారులకిస్తారు.

టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని యోగి సర్కారు నాలుగేళ్ల నుంచే క్రీడాకారుల కోసం 44 హాస్టళ్లు, స్టేడియాలు నిర్మించింది. పాత వాటికి మరమ్మతులు కూడా చేయించింది. 19 జిల్లాల్లో 890 మంది క్రీడాకారుల కోసం ప్రత్యేక కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తోంది. రూ 1,000 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్‌ను రూ 2,500 కోట్లకు పెంచింది.

కరోనాతో ఏడాది వాయిదా పడిన టోక్యో-2020 ఒలింపిక్స్‌కు ఈనెల 23న తెరలేవనుంది. వచ్చేనెల ఎనిమిది వరకు జరిగే మెగా ఈవెంట్‌లో 33 క్రీడాంశాల్లో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడుతున్నారు. ప్రారంభ కార్యక్రమం ఈ నెల 23న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.25కి మొదలు కానుంది.