మాస్క్ లు లేని పర్యాటకుల గుంపులు.. ప్రధాని ఆందోళన

కొండ ప్రాంతాలలో పర్యాట‌కుల‌లో చాలా మంది ఫేస్ మాస్కులు ధ‌రించ‌డంలేద‌ని, సామాజిక దూరం కూడా పాటించ‌డం లేదని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ స్టేష‌న్స్‌లో, మార్కెట్‌ల‌లో ఫేస్ మాస్కులు లేకుండా జ‌నం భారీ సంఖ్య‌లో గుమిగూడటం మంచిది కాదని హితవు చెప్పారు.  ప్ర‌జ‌లు తూచా త‌ప్ప‌కుండా క‌రోనా నిబంధ‌న‌లు పాటించేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు.

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ ఇవాళ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతూ.. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పేర్కొన్నారు. ప‌రిస్థితి చేయిదాట‌క ముందే మ‌నం మ‌హ‌మ్మారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్‌లా థ‌ర్డ్ వేవ్ కూడా విజృంభించ‌కుండా నిలువ‌రించాలంటే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం కావాల‌ని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించడంలేద‌ని, ఇది ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యమ‌ని ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా పర్యాటకం, వ్యాపారం తీవ్ర ప్రభావంపై గురికావడం వాస్తవమే అయినప్పటికీ మాస్క్ లు లేకుండా  భారీ స్థాయిలో గుంపులు గుమికూడడం భావ్యం కాదని స్పష్టం చేశారు. మూడో వేవ్ వచ్చే లోగా ప్రజలు ఆనందంగా గడపాలని అనుకొంటున్నారనే వాదనని కొట్టిపారవేస్తూ మూడో వేవ్ దానంతట అది రాదని, ప్రజలే అందుకు కారణమవుతారనే విషయాన్ని ముందు గుర్తించాలని హితువు పలికారు. 

థర్డ్ వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే అంతా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం, పెద్దఎత్తున జనం గుమిగూడటం వల్లనే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు, తగిన చికిత్స కీలకమని ప్రధాని చెప్పారు. కోవిడ్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని, సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ తప్పనసరని స్పష్టం చేశారు. అదేవిధంగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ వ్యూహం అనుసరించాలని,  ఇది విజయవంతమైన వ్యూహంగా నిలిచిందని చెప్పారు.

అదేవిధంగా క‌రోనా మ‌హ‌మ్మారి అనేక రూపాలు సంత‌రించుకుంటున్న‌ద‌ని, వాటిపై మ‌నం ఓ క‌న్నేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని హెచ్చరించారు. క‌రోనా వేయింట్ల‌పై నిపుణులు అధ్య‌య‌నం చేస్తున్నార‌ని, మ‌నంద‌రం కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంతోపాటు ప్ర‌జ‌లు కూడా పాటించేలా ప్రోత్స‌హిద్దామ‌ని ఆయ‌న ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ప్యాకేజీ ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పడకల సంఖ్య, ఆక్సిజన్ సౌకర్యాలు పెంచడం వంటివి వేగవంతం చేయాలని సూచించారు. పీఎం కేర్స్ ద్వారా దేశంలో వందలాది ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పీఎం కేర్స్‌తో ఈశాన్య రాష్ట్రాల్లో 150 ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వీలు కలిగిందని చెబుతూ  సాధ్యమైనంత త్వరగా ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్ నిరోధక టెస్టులు వేగవంతం చేయాలని, సమష్టిగా కరోనా వ్యాప్తిని ప్రజలు ఎదుర్కోగలరనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. రాష్ట్రాలకు అవసరమైన సహాయానికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో కరోనా కట్టడికి సూక్షస్థాయిలో కఠిన చర్యలు చేపట్టవలసి ఉంటుందని ప్రధాని తెలిపారు. కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేయడంతో పాటు కరోనా వైరస్ మ్యుటేషన్‌పై కఠిన పర్యవేక్షణ తప్పనిసరని ప్రధాని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. 

కాగా, ఈ నెల 16న ఆరుగురు ముఖ్యమంత్రులతో ప్రధాని కరోనా పరిస్థితులపై సమీక్ష జరుపనున్నారు. తమిళ్ నాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో ఆయన సమీక్ష జరుపుతారు.