మంత్రి పదవులపై మోజు లేదు… పంక‌జ ముండే

త‌న సోద‌రి ప్రీత‌మ్ ముండేకుగానీ, త‌న‌కుగానీ మంత్రి ప‌ద‌వుల మీద మోజు లేద‌ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పంక‌జ ముండే స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత గోపినాథ్ ముండే   త‌న‌నుగానీ, త‌న సోద‌రి ప్రీతమ్ ముండేనుగానీ మంత్రి ప‌ద‌వుల కోసం రాజ‌కీయాల్లోకి తీసుకురాలేద‌ని ఆమె  చెప్పారు. 

త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం మ‌హారాష్ట్ర బీజేపీ త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసింద‌ని, కానీ తాను తిర‌స్క‌రించాన‌ని పంక‌జ ముండే తెలిపారు. బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయ‌కురాలిన‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా త‌న‌కు నాయ‌కుల‌ని, వారి మాటలే శిరోధార్యాలని ఆమె తేల్చి చెప్పారు. 

ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో తనకు స్థానం లభించలేదని అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న కథనాలను ఆమె కొట్టిపారవేసారు.  ఇటీవ‌ల జ‌రిగిన కేంద్రమంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నందుకు త‌న అనుచ‌రులు చాలా మంది పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఆమె తెలిపారు.  

 త‌న కోసం ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డ త‌న అనుచ‌రులంద‌రినీ వారించాన‌ని, త‌న కోసం ఎవ‌రూ త్యాగాలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పాన‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ విష‌యంలో తానేమీ ధ‌ర్మ యుద్ధం చేయాల‌నుకోవ‌డం లేద‌ని, మాజీ సామాజిక వ‌ర్గం ఒక‌రికి మంత్రివ‌ర్గంలో చోటుద‌క్కింద‌ని, అంతే చాల‌ని ఆమె వ్యాఖ్యానించారు.

త‌న తండ్రి గోపినాథ్ ముండే ఎప్పుడైనా సమాజంలో అట్ట‌డుగు వ‌ర్గాల వారికే ఉన్న‌త ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేవార‌ని పంక‌జ ముండే గుర్తుచేసుకున్నారు.