నవ్‌ జోత్‌ సిద్ధూ ఆప్ వైపు అడుగులు వేస్తున్నారా!

నవ్‌ జోత్‌ సిద్ధూ ఆప్ వైపు అడుగులు వేస్తున్నారా!
కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను అంతర్గత కుమ్ములాటలు కలవరం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్, మాజీ మంత్రి నవ్ జ్యోత్ సిద్ధుల మధ్య నెలకొన్న వివాదాలు ఎన్నికలలో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపగలవని పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతున్నది. 
 
వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ, ప్రింయంక గాంధీ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. పార్టీ అధిష్ఠానం మాటను గౌరవిస్తానని అంటూనే సిద్ధుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చే ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు.
 
 ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాని, ఉప ముఖ్యమంత్రి పదవి గాని ఇవ్వాలని సిద్దూ పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. అటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వాన్ని పొగడ్తలతో నింపుతూ మంగళవారం సిద్దూ ఇచ్చిన ట్వీట్ కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నది. పార్టీ నాయకత్వంను బెదిరించడాన్నికా లేదా ఆ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. తమ పార్టీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఇదివరకే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం. 
 
కీలకమైన స్థానిక పాలన, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను తన నుండి తొలగించడంతో గత ఏడాది కెప్టెన్ అమరిందర్ సింగ్ మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన సిద్దూ అప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికల లోగా రాష్ట్రంలో నాయకత్వం మార్చాలని పార్టీ అధిష్ఠానంపై వత్తిడి తెస్తున్నారు. 
 
మూడు సార్లు బిజెపి అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఈ మాజీ క్రికెటర్ 2017లో ఆ పార్టీ నుండి వైదొలిగి కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికలలో పంజాబ్ లో కాంగ్రెస్ తిరిగి గెలుపొందితే ముఖ్యమంత్రి పదవి పొందాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నది. 
కాంగ్రెస్ లో అటువంటి అవకాశాలు లేవని స్పష్టం అయిన పక్షంలో ఆప్ వైపు మొగ్గుచూపుతాననే సంకేతం ఇప్పుడు ఇస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. 
నిత్యం ముఖ్యమంత్రిపై విమర్శలు కురిపిస్తూ ఆయనతో సయోధ్య అసంభవం అనే సంకేతాలు ఇస్తున్నారు. పైగా,  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రాహుల్, ప్రియాంక ఢిల్లీలో భేటీ జరుపుతున్న సమయంలోనే సిద్దూ ఈ ట్వీట్ ఇవ్వడం గమనార్హం. ఈ భేటీలో పంజాబ్ కాంగ్రెస్ లోని కుమ్ములాటలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది.  
తన పనిని ఆప్‌ ఎప్పుడూ గుర్తిస్తుందని తన ట్వీట్‌ లో పేర్కొనడం ద్వారా తనకు కాంగ్రెస్ లో తగు గుర్తింపు లభించడం లేదనే ఆవేదనను వ్యక్తం చేశారు. పంజాబ్‌ కోసం ఎవరు పోరాడుతున్నారో దీని ద్వారా తెలిసిపోతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌, రైతుల అంశంతో పాటు అవినీ తెలితి, విద్యుత్‌ సంక్షోభం వంటి అంశాలపై ఆప్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారని తెలపడం ద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రి కీలక అంశాలను దాటవేస్తున్నారనే విమర్శలు గుప్పిచిన్నట్లు పలువురు భావిస్తున్నారు. 
 
పంజాబ్ లో నాయకత్వం మార్పు ప్రసక్తి లేదని స్పష్టం చేసిన  ఏఐసీసీ పంజాబ్ ఇన్ ఛార్జ్ హరీష్ రావత్ వారం రోజులలో ప్రదేశ్ కాంగ్రెస్ కు నూతన అధిపతిని నియమించబోతున్నట్లు ప్రకటించారు. దానితో పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చి పార్టీ నాయకత్వం చేపట్టాలని సిద్దూ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.