కరోనా కట్టడికి ఉపరాష్ట్రపతి పంచ సూత్ర ప్రణాళిక

కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతీ ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ఆయన పేర్కొన్నారు. 
 
కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదని స్పష్టం చేశారు. 
కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితలు రాసిన కథలతో వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో వచ్చిన  ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 

కరోనా విషయంలో ప్రారంభంలో ఆందోళనకు గురయినా వెంటనే తేరుకుని ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో  ఈ మహమ్మారితో పోరాటం చేయడంలో భారత్‌ ముందు వరుసలో ఉందని తెలిపారు.  మన శాస్త్రవేత్తలు, పరిశోధనకారుల కృషితో టీకాను తయారు చేసి మన ప్రజలకే కాకుండా, విదేశాలకు  సైతం అందించారని చెప్పారు.  ప్రజల్లో టీకాలపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు.

కరోనా కట్టడికి సూచనలు
– కోవిడ్ ఎదుర్కొనే దిశలో శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవసరమని చెప్పారు. దీని కోసం వ్యాయామం, నడక, యోగ లాంటివి చేయాలని సూచించారు.
– ధ్యానం చేయడం  ద్వారా మానసిక ప్రశాంతత పొందాలని తెలిపారు.
– వ్యర్థమైన జంక్‌ఫుడ్ మీద గాక సంతులన, పోషకాహారం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి.
– ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం, మాస్కులు , చేతులు శుభ్రం చేసుకోవడం  టీకా తీసుకోవడం వంటిని తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.
– ప్రకృతిని ప్రేమించాలని ఏసీ గదుల్లో కాకుండా.. వీలైనంత ఎక్కువగా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

కరోనా కొత్తకథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. కొత్త అనుభవాల నుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు అంకితమివవ్వడాన్ని ఆయన  ప్రత్యేకంగా అభినందించారు. 

బాలసుబ్రమణ్యం జీవితం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. మరోసారి బాలుకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన కాళీపట్నం రామారావు, పోరంకి దక్షిణామూర్తిలకు  ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.

అమెరికాలో నివసిస్తున్నప్పటికీ అమ్మభాషను మరచిపోకుండా మాతృభూమితో మమేకమవుతూ ఈ కొత్త కథలు పుస్తకంలో తెలుగు కథలతో ఆకట్టుకున్న ప్రవాసాంధ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించి, వాటిని అక్షరబద్ధం చేసి ముందుతరాలను ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీదా ఉందని సూచించారు.