యుపిలో ఇద్దరు పిల్లలకే పరిమితం… లేదా ప్రభుత్వ ఉద్యోగాలు, పధకాలు కట్!

జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురావాలని అనుకుంటోంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ) యాక్ట్-2021 తొలి ముసాయిదాను తీసుకురానుంది. 

ఈనెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ ముసాయిదాను తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ఈ బిల్లు చట్టం అయిన తర్వాత రెండు, లేదా అంతకంటే తక్కువ పిల్లలు ఉన్నవారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు లభించవు. 

ఈ ముసాయిదాపై 10 రోజుల్లోగా ప్రజలు తమ స్పందన తెలపాలని ‘స్టేట్ లా కమిషన్’ కోరనుంది. జూలై 19వ తేదీ వరకూ గడువుగా నిర్దేశించించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం యూపీ పాపులేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ అందించనుంది. 

ఈ బిల్లు ప్రకారం ఇద్దరు పిల్లల విధానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా  వారి ఉద్యోగ కాలంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇస్తారు. లేదా సంబంధిస్తులకు 12 నెలల పెటర్నిటీ సెలవు పూర్తి  జీతం, భత్యాలతో సెలవుతో పాటు జాతీయ పెన్షన్ పధకంలో ప్రభుత్వ వాటాలో 3 శాతం పెంచుతారు. 

ముసాయిదా బిల్లు ప్రభుత్వ బాధ్యతలను కూడా పేర్కొన్నది. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మాతా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల నిర్వహణతో పాటు కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తల సహాయంతో కుటుంభ నియంత్రణ మందులు బిళ్ళలు, కండోమ్ లను పంపిణి  చేయడంతో పాటు ప్రజలలో అవగాహన కలిగించే బాధ్యతలను ఎన్ జి ఓ లకు అప్పచెబుతారు. 

గర్భం దాల్చడం, శిశు జననం, మరణాలను చట్టబద్ధంగా నమోదు చేయడం కూడా విధిగా చేసే విధంగా చూస్తారు. అన్ని సెకండరీ పాఠశాలల్లో జనాభా నియంత్రను తప్పనిసరి బోధనాంశంగా చేయాలని కూడా ఈ బిల్లు సూచిస్తున్నది. 

జనాభా నియంత్రణ అవసరాన్ని ఈ బిల్లు ప్రస్తావిస్తూ ఉత్తర ప్రదేశ్ లో పరిమితమైన పర్యావణ, ఆర్ధిక వనరులు ఉండడంతో ప్రజలు అందరికి కనీస సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత ఉన్నదని పేర్కొన్నది. కనీస సదుపాయాలు అంటే అందుబాటులో ఆహరం, రక్షిత తాగు నీరు, గౌరవమైన గృహం, అందుబాటులో నాణ్యమైన విద్య, ఆర్ధిక/జీవనోపాధి  అవకాశాలు, గృహవినియోగం కోసం విద్యుత్, రక్షిత నివాసం అని వివరించారు. 

రాష్ట్రంలోని పరిమిత వనరుల కారణంగా జనాభాను నియంత్రించాల్సిన అవసరమం ఉందని రాష్ట్ర ముసాయిదా చట్టం పేర్కొంటోంది. జనాభా నియంత్రణకు కమ్యూనిటీ-సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం పిలుపునిచ్చారు.

అందువల్ల వనరులు సక్రమంగా ప్రజలకు చేరి రాష్ట్రం సరైన రీతిలో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అంటున్నారు. ”జనాభా పెరగడానికి పేదరికం, నిరక్షరాస్యత కీలక కారణాలు. కొన్ని కమ్యూనిటీల్లో దీనిపై (జనాభా నియంత్రణ) అవగాహన లేదు. అందువల్ల కమ్యూనిటీ సెంట్రిక్ అవేర్‌నెస్ తీసుకురావాలి” అని యోగి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.