ఏపీ రుణ అర్హతలో  రూ 17 వేల కోట్లు కోత

కేంద్ర హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆర్ధిక క్రమశిక్షణారాహిత్యం ఆవలంభిస్తున్న  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రం నుండి భారీగా రుణ అర్హతతో కోతను ఎదుర్కోవలసి వస్తున్నది.  ఈ ఏడాది రాష్ట్రం అప్పు తీసుకొనే అర్హతలో ఏకంగా రూ.17వేల కోట్లు కోత పెట్టింది. 

అనుమతించిన దానికంటే గతంలో ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్లే ఈ కోత పెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ నుంచి జూన్‌ 30న రాష్ట్రానికి లేఖ అందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9నెలల్లో రాష్ట్రం రూ.20వేల కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 

ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సునీత్‌ అగర్వాల్‌ రాసిన లేఖను పీఏసీ చైౖర్మన్‌, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మీడియాకు విడుదల చేశారు. 

ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు ఎంతమేర రుణాలు తీసుకోవచ్చో కేంద్రం ఖరారు చేస్తుంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతానికి సమానమైన స్థాయిలో అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 22న రాసిన లేఖ ఆధారంగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో రూ.42వేల కోట్ల మేర అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించింది.

అందులో మొదటి 9నెలల్లో రూ.37వేల కోట్లు, చివరి 3నెలల్లో మిగిలిన రూ.5వేల కోట్లు తీసుకోవాలని షరతు విధించారు. అయితే గతంలో ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ఆ మేరకు ఈ ఏడాది అప్పు తీసుకొనే అర్హతలో కోత పెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తన లేఖలో వివరించింది.  దీనిప్రకారం మొదటి 9నెలల్లో రూ.20వేల కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తీసుకొన్న రాష్ట్ర అభివృద్ధి రుణాన్ని తర్వాత ఏపీ, తెలంగాణ చెల్లిస్తున్నాయి. తన వాటా రుణాన్ని తెలంగాణ రాష్ట్రం ఏపీకి ఇస్తోంది.

రెండింటి తరఫునా ఆ రుణం ఏపీనే కేంద్రానికి చెల్లిస్తోంది. అయితే రెండు రాష్ట్రాలు కలిపి చెల్లించిన రుణాన్ని ఏపీ పూర్తిగా తన ఖాతాలో చూపించి కొత్త రుణం ఎక్కువగా తీసుకుంటోందని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలను ఆడిట్‌ చేసిన ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది.

ఈ రకంగా ఏపీ రూ.17వేల కోట్లు ఎక్కువ రుణం తీసుకొన్నట్లు తెలుపుతూ ఆ మేరకు ఇప్పుడు కోత పెట్టింది. దీనిపై రాష్ట్రం తన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆర్థికశాఖ లేఖ ప్రకారం తిరిగి చెల్లించిన రుణాల ద్వారా వచ్చిన అర్హతతో కలిపి ఈ ఏడాది రూ.51వేల కోట్ల మేర కొత్త అప్పులు తీసుకోవడానికి అనుమతి ఉంది. 

ఇందులో కేంద్రం కోత పెట్టిన తర్వాత ఆ పరిమితి రూ.33వేల కోట్లకు తగ్గింది. ఇతరత్రా రుణాలు రూ.6వేల కోట్లు తీసివేస్తే బహిరంగ మార్కెట్లో తీసుకొనే రుణాల పరిమితి రూ.27వేల కోట్లకు తగ్గింది. ఇందులో మొదటి 9నెలల్లో రూ.20వేల కోట్లు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.