జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు.. జగన్ వీరాభిమాని అరెస్ట్  

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ తెరా రాజశేఖరరెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ నుంచి కేసును తీసుకొన్నతర్వాత సీబీఐ చేసిన తొలి అరెస్టు ఇదే. శనివారం గుంటూరు కోర్టుకు రాజశేఖర్‌రెడ్డిని తీసుకురాగా, కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది. 

పులివెందుల నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కొన్నేళ్లుగా కువైత్‌లో ఉంటున్నారు. ఈయన సీఎం  జగన్‌కు వీరాభిమాని అని సమాచారం. వైసీపీకి చెందిన సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 

గత ఏడా ది న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్య లు చేస్తూ పోస్టులు పెట్టినట్టు హైకోర్టు రిజిస్ట్రార్‌ పలువురిపై సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టింది. 

కరోనా తగ్గడంతో ప్రస్తుతం  సీబీఐ వేగం పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఇటీవలే కువైత్‌ నుంచి వచ్చేసి కడపలో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకొని సీబీఐ పోలీసులు శుక్రవారం రాత్రి కడపలో అదుపులోకి తీసుకొన్నారు. అక్కడ నుంచి ఆయనను గుంటూరుకు తరలించారు. 

గుంటూరులోని సీబీఐ కేసులు చూస్తున్న నాల్గో అదనపు జూనియర్‌ సివిల్‌ మెజిస్ర్టేటు కోర్టులో రాజశేఖర్‌రెడ్డి హాజరుపరచారు. నిందితుడికి మెజిస్ర్టేటు అరుణశ్రీ ఈనెల 23 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. కాగా పోలీసు కస్టడీ కోరుతూ సీబీఐఅధికారులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్య లు చేస్తూ సోషల్‌ మీడియాలో వైసీపీ నాయకులతోపాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు గత ఏడాది పెద్దఎత్తున పోస్టు లు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ కోర్టు ల్లో తీర్పులు వెలువడినప్పుడల్లా ఈ పోస్టుల్లో రెచ్చపోయేవా రు.

ఈ పోస్టింగులపై హైకోర్టు తీవ్రంగా స్పందించి సుమోటోగా, వాటి ని విచారణకు స్వీకరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ బి .రాజశేఖర్‌ ఏప్రిల్‌ 16, 17, మే 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు అప్పట్లో పలువురిపై ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశారు.

అయితే  దర్యాప్తులో పురోగతి లేకపోవటంతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని సీబీఐ అధికారులు గత ఏడాది నవంబరు 11న కేసు నమోదు చేశారు. ఇందులో సీఐడీ నమోదు చేసిన క్రైం నంబరు 11/20లో కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి 15వ నిందితుడు.

\