తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దానితో రాష్ట్రంలో తెలుగు భాష ఉనికి ప్రశ్నార్ధకరంగా మారినట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో బోధనకు తిలోదకాలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌లో నలుగురి నియామకం కూడా చేపట్టింది. తాజా ప్రభుత్వ నిర్ణయం తెలుగు భాషాభిమానులను షాక్‌కు గురి చేసింది.
ఇక తెలుగు అకాడమీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎపి ప్రభుత్వం తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భాస్కర్ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకులు డాక్టర్ నేల రాజ్‌కుమార్, గుంటూరు జెకెసి కాలేజ్ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.విజయశ్రీ, ఎస్‌ఎంఎస్ బిఇడి కళాశాలకు చెందిన లెక్చరర్ కప్పగంతు రామకృష్ణను అకాడమీ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మురళీధర్ శర్మను అకాడమీలో పాలకవర్గ సభ్యులుగా, యూజిసి నామినీగా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సతీష్ చంద్ర జీవోలు జారీ చేశారు. తెలుగు సంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు అకాడమీ పేరును మార్చడంపై ఎపిలోని పలు వర్గాలు, భాషాభిమానులు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రంలో తెలుగు అకాడమీ గల్లంతు కానుంది అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తే.. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ తెలుగు భాషకు గుర్తింపు తీసుకు వచ్చారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలుగు అకాడమీ విశేషంగా కృషి చేసింది.
రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలుగు అకాడమీపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు ధర్మాసనం వెల్లడించింది.
ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వివాదం ఇంకా తేల్చకుండానే తెలుగు అకాడమీ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భాషాభిమానులకు అశనిపాతంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం,విద్యా విషయకంగా తెలుగు వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని ధ్వజమెత్తారు. తెలుగు-సంస్కృత అకాడెమీ అని ఎందుకింత హడావిడిగా మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత ఆకాడమీగా మార్చటాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విచిత్రమైనదిగా అభివర్ణించారు. ఇది తెలుగువారిని అవమానించటమేనని మండిపడ్డారు. తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన సంస్థ అవసరమని భావించి 1968లో పీవీ నరసింహారావు ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషకు సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయని గుర్తు చేశారు.
తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలపడం ద్వారా భాషకు ఎనలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలు, ఆదర్శాలు ఈ ప్రభుత్వానికి తెలియదని, తెలుసుకొనే ప్రయత్నం చేయటం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే తెలుగు ప్రాథమిక విద్య స్థాయిలో నిరాదరణకు గురవుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు అకాడమీ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగుకు, సంస్కృతానికీ వేర్వేరుగా ఆకాడమీలు ఉన్నప్పుడు మాత్రమే పరిశోధనలకు, భాష, సాహిత్య అభివృద్ధికి వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగుకు సంబంధించి అన్ని సంస్థలు నిరాదరణకు గురవుతున్నాయని, అకాడమీ విషయంలో ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి